ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

by Jakkula.Mamatha |

కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
X

దిశ, పెద్దకొత్తపల్లి: కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల నుంచి ఫారాల స్వీకరణ, వాటి పరిశీలన, ఆన్‌లైన్ డిజిటలైజేషన్, డేటా నమోదు తదితర అంశాలను నిశితంగా పరిశీలించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. గ్రామంలోని ఓటర్ల జాబితా ప్రకారం ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని, పంపిణీ చేసిన ఫారాలను నిర్ణీత గడువులోగా తిరిగి సేకరించి వాటిలో పొందుపరిచిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించారు. ఓటర్లు సమర్పించిన ప్రతి ఫారంలోని వివరాలు అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని, పేర్లు, చిరునామాలు, వయస్సు, కుటుంబ వివరాలు, గుర్తింపు పత్రాలకు సంబంధించిన సమాచారం వంటి అంశాల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కచ్చితత్వంతో పని చేయాలని సూచించారు.

ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, అవసరమైన ఆధారాలను ధృవీకరించిన తరువాతే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఓటరుకు సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసిన కలెక్టర్, ఎవరు ఈ ప్రక్రియకు దూరం కాకుండా గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించాలని, వృద్ధులు, దివ్యాంగులకు, నిరుపేదలు, దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ప్రత్యేక సహకారం అందించి వారి ఫారాలను సకాలంలో స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతతో పాటు వేగం కూడా ముఖ్యమని, ప్రతిరోజూ పనుల పురోగతిని సమీక్షిస్తూ పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని చెప్పారు.

ఎక్కడైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆయన తెలిపారు. అనంతరం డిజిటలైజేషన్ నిర్వహిస్తున్న సిబ్బందితో జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా మాట్లాడి, ఫారాల స్వీకరణ శాతం, డేటా నమోదు పురోగతి, ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని, కార్యాలయానికి వచ్చే ప్రతి ఓటరుకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.

ఫారాలు సమర్పించేందుకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఎటువంటి సందేహాలున్నా వెంటనే నివృత్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల శిధిలావస్థలో ఉందని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, జిల్లా కలెక్టర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, అధికారులను ఆదేశించారు. భవన ఫిట్నెస్ను పరిశీలించి మరమ్మతులు చేయాల్సి వస్తే చేయాలని, లేని పక్షంలో నూతన భవనానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, తాహసిల్దార్ శ్రీనివాసులు, బాచారం గ్రామ సర్పంచ్ నిర్మల, సంబంధిత శాఖల అధికారులు, బీఎల్ఓ, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story