భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. ఇద్దరు పిల్లలను నిజాంసాగర్ ప్రాజెక్టులో తోసేసి తండ్రి ఆత్మహత్య

by Jakkula.Mamatha |

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను వెంట తీసుకెళ్లి డ్యామ్‌లో తోసివేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద గురువారం చోటుచేసుకుంది.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. ఇద్దరు పిల్లలను నిజాంసాగర్ ప్రాజెక్టులో తోసేసి తండ్రి ఆత్మహత్య
X

దిశ, నిజాంసాగర్: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను వెంట తీసుకెళ్లి డ్యామ్‌లో తోసివేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద గురువారం చోటుచేసుకుంది. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, నిజాంసాగర్ ఎస్ఐ శివ కుమార్‌ల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బోయి కృష్ణ(34) తన భార్య పిల్లలతో కలిసి పఠాన్ చెరులో గత మూడు నెలలుగా నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. అతను ఇక్కడే పెయింటర్ పనితోపాటు వాచ్ మెన్‌గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి గొడవలు జరుగుతుండడంతో జీవితంపై విరక్తి చెందిన కృష్ణ తన ఇద్దరు పిల్లలు అయిన కొడుకు రక్షిత్(9), కూతురు అనన్య(5)లను గురువారం ఉదయం టూర్‌కు తీసుకు వెళుతున్నానని వెంటబెట్టుకొని నిజాంసాగర్ డ్యామ్‌కు వచ్చాడు. ఇక్కడ ఫొటోలు, సెల్ఫీ తీసుకుని వారిని డ్యామ్‌లో తోసివేసి తాను పడ్డాడు. అంతకు ముందు పిల్లలను చంపానని, వీడియో కాల్ చేసి అతను కూడా చనిపోతున్నానని చెప్పాడు. మృతుని తల్లి సాయమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై శివ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని రెస్క్యూ టీంకు సమాచారం ఇవ్వగా వారు శుక్రవారం ఉదయం ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story