Medaram 2026: నిలువెత్తు బంగారం సమర్పించిన డీజీపీ

by Gantepaka Srikanth |

మేడారం మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.

Medaram 2026: నిలువెత్తు బంగారం సమర్పించిన డీజీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారం మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తజనసందోహం పోటెత్తిన వేళ.. క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్వయంగా డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌లో విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు, గద్దెల వద్దకు చేరుకున్న డీజీపీ వనదేవతలను దర్శించుకుని మొక్కుల రూపంలో ‘నిలువెత్తు బంగారం’ (బెల్లం) సమర్పించుకున్నారు. జాతరలో రద్దీ పెరిగిన నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో డీజీపీ మాట్లాడుతూ.. జాతర చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం భద్రతలో కీలక మార్పులు తీసుకొచ్చిందని వివరించారు. ‘మేడారం 2.0’ పేరుతో అమలు చేస్తున్న ‘టీజీ-క్వెస్ట్’ కృత్రిమ మేథ ఆధారిత డ్రోన్ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా సుమారు 30 చదరపు కిలోమీటర్ల మేర ప్రతి అంగుళాన్ని నిశితంగా గమనిస్తున్నామన్నారు. ఈ డ్రోన్లు ‘డిజిటల్ బీట్ ఆఫీసర్లు’గా వ్యవహరిస్తూ అటవీ ప్రాంతం, జంపన్న వాగు వంటి ప్రదేశాల నుంచి ఎప్పటికప్పుడు ప్రత్యక్ష సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జనసందడిలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్లు మంచి ఫలితాలనిస్తున్నాయని, పాత నేరస్తులను గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్, అనుమానాస్పద వస్తువులను పసిగట్టేందుకు ఏఐ అలర్ట్స్ వాడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

తక్షణమే స్పందించేలా ఏర్పాట్లు

శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 13 వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది ఏడు రోజుల పాటు నిరంతరం విధుల్లో ఉంటారని డీజీపీ వెల్లడించారు. వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా 2000 ఎకరాల్లో 37 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేసి, వాటిని ఏఎన్పీఆర్ నిఘా వ్యవస్థతో అనుసంధానించామన్నారు. దాదాపు 450 సీసీటీవీల ద్వారా జాతరలోని ప్రతి కదలికను హైదరాబాద్‌లోని రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం 3800 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని, జాతరలో ఎక్కడ ఏ సమస్య ఎదురైనా తక్షణమే స్పందించేలా 24 గంటల పాటు పోలీస్ హెల్ప్ డెస్కులు అందుబాటులో ఉన్నాయని డీజీపీ వివరించారు. ఈ పర్యటనలో మల్టీ జోన్-1 ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ములుగు ఎస్పీ కేకన్ సుధీర్ రామ్ నాథ్, మేడారం బందోబస్తు కోసం వచ్చిన ఐపీఎస్ అధికారులు డీజీపీ వెంట ఉన్నారు.

Next Story