సీఎం సిద్ధరామయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్!

by Malleboina Mahesh |

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. హవేరీలో జరిగిన 'గ్యారంటీ సమ్మేళనం'లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విగ్రహాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆవిష్కరించారు.

సీఎం సిద్ధరామయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్!
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం పదవిపై డీకే శివకుమార్, సిద్దరామయ్య (Siddaramaiah) మధ్య గత కొన్ని నెలలుగా పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (Deputy CM DK Shivakumar) తన అనుచరులతో పలుమార్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లగా దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. హవేరీ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah) నిలువెత్తు విగ్రహాన్ని (statue) డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా ఆవిష్కరించారు. దీంతో గత కొద్దిరోజులుగా ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు ఉందనే ప్రచారానికి చెక్ పెడుతూ, సిద్ధరామయ్యపై తనకున్న గౌరవాన్ని, అభిమానాన్ని డీకే శివకుమార్ ఈ రూపంలో చాటుకున్నారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సిద్ధరామయ్యకు ఆయన ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ విగ్రహావిష్కరణ వెనుక ఒక బలమైన రాజకీయ సంకేతం కనిపిస్తుంది. సిద్ధరామయ్య నాయకత్వంలో కర్ణాటక ప్రభుత్వం 1000 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, పార్టీలో ఉన్న ఐక్యతను ప్రజలకు చాటి చెప్పేలా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ముఖ్యంగా గ్యారంటీ పథకాల అమలులో సిద్ధరామయ్య పోషించిన పాత్రను కొనియాడుతూ, ఆయన ఒక ప్రజా నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారనే ఉద్దేశంతో ఈ ప్రతిమను ఏర్పాటు చేసినట్లు డీకే శివకుమార్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి పదవి రేసులో ఎప్పుడూ ఒకరితో ఒకరు పోటీ పడే ఈ ఇద్దరు నేతలు, ఇలా ఒకే వేదికపై విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం తన విగ్రహాన్ని డిప్యూటీ సీఎం ఆవిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం తన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని, కాంగ్రెస్ పార్టీ సమష్టి కృషికి దక్కిన గుర్తింపు అని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story