మహాత్మా గాంధీ ఏ పాపం చేశారు : చెన్నై బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Muthe.Rajitha |

యూపీఏ తెచ్చిన ఈ పథకం ఓ నిశ్శబ్ద విప్లవం. ఈ పథకాన్ని తిరిగి తెచ్చే వరకు కోట్లాది కాంగ్రెస్ శ్రేణులు పోరాడుతాయి

మహాత్మా గాంధీ ఏ పాపం చేశారు : చెన్నై బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహాత్మా గాంధీ ఏం పాపం చేశారని ఉపాధి హామీ పథకం నుంచి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తొలగించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గురువారం చెన్నైలో ఉపాధి హామీ పథకం నిబంధనలు మార్పు, ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర అనంతరం ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి ఆ పథకం కనిపించకుండా చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో మహాత్మా గాంధీని పేరు తొలగించడమే కాదు వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ గ్యారంటీ కల్పించాలన్న ఆత్మను సైతం తొలగించారని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలోని కోట్లాదిమంది వ్యవసాయ కార్మికులు ఏం పాపం చేశారని ఉపాధి హామీ పథకంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మార్పులు చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రతి వ్యవసాయ సీజన్లో 50 పైసల కూలీ ధరల పెరుగుదల కోసం దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు, పోలీసు లాఠీచార్జీలు, రక్తపాతం జరిగేవని, ఈ దారుణమైన పరిస్థితులను పారద్రోలాలన్న మానవీయకోణంతో యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో దేశంలోని కోట్లాదిమంది వ్యవసాయ కార్మికుల కోసం ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారని భట్టి విక్రమార్క తెలిపారు. గొప్ప పథకాన్ని కనుమరుగు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి పథకంలో అనేక మార్పులు తీసుకువచ్చిందని, చివరకు దేశ ప్రజలు మహాత్మునిగా పిలుచుకునే గాంధీ పేరును సైతం తొలగించిందని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీల పిలుపుమేరకు అన్ని రాష్ట్రాల పీసీసీ కమిటీల ఆధ్వర్యంలో దేశంలోని కోట్లాది వ్యవసాయ కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించే వరకు వ్యవసాయ కార్మికుల పక్షాన దేశంలోని కోట్లాది మంది కాంగ్రెస్ శ్రేణులు వ్యవసాయ కార్మికుల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తాయని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సామాన్యునికి ఇబ్బందులు వచ్చినప్పుడు తమిళనాడు ఎల్లప్పుడూ ముందు వరుసలో నిలబడుతుందని, ఇప్పుడు కూడా రాష్ట్రం ముందు వరుసలో నిలబడి వ్యవసాయ కార్మికుల పక్షాన నిలబడటం అభినందనీయం అన్నారు.

గాంధీ మనకు స్వేచ్ఛను ఇచ్చారు, పెరియార్ ఆత్మగౌరవాన్ని, కామరాజు నిజాయితీని, అన్నా దురై మనకు గౌరవాన్ని ఇచ్చారని, ఈ వారసత్వానికి తగిన భవిష్యత్తును మన బిడ్డలకు ఇవ్వాలి అదే కాంగ్రెస్ లక్ష్యం, నైతిక కర్తవ్యం, చారిత్రాత్మక బాధ్యత అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సభలో తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు సెల్వ తదితరులు పాల్గొన్నారు.

Next Story