- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
88 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు పట్టం
రాష్ట్రవ్యాప్త మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మెజారిటీ స్థానాలను గెలుచుకుని తన పట్టును నిరూపించుకుంది. నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ సత్తా చాటగా, హంగ్ ఏర్పడిన చోట్ల ఇండిపెండెంట్ల మద్దతు కోసం ప్రధాన పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపాలిటిల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కార్పొరేషన్‌లలోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. కాంగ్రెస్ 88 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బీఆర్ఎస్ 17 మున్సిపాలిటిల్లో, సీపీఐ ఒక కార్పొరేషన్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. నిజామాబాద్, కరీంనగర్ రెండు కార్పొరేషన్‌లలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించి మిగిలిన పార్టీల కంటే ముందు నిలిచింది. పురపాలక, నగర పాలక ఎన్నికల్లో రాష్ట్రంలోని ఓటర్లు కాంగ్రెస్‌కు జై కొట్టారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
ఇందులో 88 స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే 4 చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కొత్తగూడెం కార్పొరేషన్‌లోనూ మొత్తం 60 వార్డుల్లో కాంగ్రెస్ 22 సీట్లు గెలుచుకుంది. మిత్రపక్షంగా ఉన్న సీపీఐ 29 సీట్లు గెలుచుకుంది. మిగతా పార్టీలు, ఇండిపెండెంట్లు కలిసి మిగతా స్థానాలు గెలుచుకున్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం 116 మున్సిపాలిటీల్లో 83 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 16 సీట్లలో బీఆర్ఎస్, 2 చోట్ల బీజేపీ(ఆదిలాబాద్, నారాయణపేట), 2 చోట్ల ఇతర పార్టీలు(భైంసా ఎంఐఎం, వడ్డేపల్లి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్) ఆధిక్యంలో ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో ఈ ఎన్నికలు జరగలేదు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన దాదాపు 81 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏకంగా 68 నియోజకవర్గాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. వార్డుల వారీగా పరిశీలిస్తే 2,996 వార్డులు, డివిజన్‌లకు ఎన్నికలు జరగ్గా ఒక వార్డు ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన వాటిలో 14 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2,981 వాటికి ఎన్నికలు జరిగాయి. మొత్తంగా ఏకగ్రీవం అయిన వాటితో కలిపితే రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం పార్టీల వారీగా కాంగ్రెస్ 1,536, బీఆర్ఎస్ 777, బీజేపీ 333, ఎంఐఎం 70 స్థానాల్లో గెలుపొందాయి. మూడు వారాలుగా సాగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఓట్ల లెక్కింపుతో కీలక ఘట్టం ముగిసింది. ఫలితాలను పార్టీలు, అభ్యర్థులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విశ్లేషించుకుంటున్నారు.
ఇండిపెండెట్లతో బేరసారాలు..
ఇండిపెండెంట్లు, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. మరికొందరు అనేక మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. హంగ్ ఏర్పడిన చోట్లలో వీరికి భారీ డిమాండ్ఏర్పడింది. వారికి కావాల్సినంత మొత్తాలు, ఒప్పందాలు చేసుకుని పార్టీల్లో చేర్చుకుంటున్నారు. వైస్ చైర్మన్పదవి ఇస్తామంటూ బేరసారాలు చేస్తున్నారు. శనివారం, ఆదివారం బేరసారాలు తారా స్థాయికి చేరుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






