వ్యక్తి అదృశ్యం.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

by Batti.Sumithra |

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వ్యక్తి అదృశ్యం.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
X

దిశ, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెర్కపల్లి గ్రామానికి చెందిన అర్కాల అనిల్ (26)కు గత ఏడాది వివాహం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో నెల రోజుల క్రితం విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం అనిల్ గ్రామంలో జిరాక్స్ సెంటర్, నెట్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 19వ తేదీన ద్విచక్ర వాహనం పై పెర్కపల్లి నుంచి సైదాపూర్‌కు వచ్చిన అనిల్, వ్యవసాయ మార్కెట్ వద్ద తన బైక్‌ను నిలిపి ఉంచాడు. అనంతరం తన తమ్ముడు రాకేష్‌కు మెసేజ్ పంపిస్తూ.. బైక్‌ను వ్యవసాయ మార్కెట్ వద్ద పార్క్ చేశానని, సెల్‌ఫోన్‌ను బైక్ టూల్‌బాక్స్‌లో ఉంచానని, వాహనం తాళంచెవిని ట్యాంక్ కవర్‌లో పెట్టానని తెలిపాడు. అయితే అప్పటి నుంచి అనిల్ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసినా ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో తమ కుమారుడు కనిపించడం లేదని అనిల్ తండ్రి అర్కాల సంపత్ సైదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story