- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తరాదిని వణికిస్తున్న శీతల గాలులు.. ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలను చలి తీవ్రంగా వణికిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రజలు గజగజలాడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలను చలి తీవ్రంగా వణికిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు (Temperatures) కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఢిల్లీలోని అయానగర్‌లో ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 2.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో విజిబిలిటీ (దృశ్యమానత) తగ్గిపోయి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొగమంచు ప్రభావం విమాన, రైలు సర్వీసులపైన కూడా పడటంతో పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఢిల్లీలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.
మరోవైపు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో చలి తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 6 డిగ్రీలకు పడిపోవడంతో ప్రఖ్యాత దాల్ సరస్సు పాక్షికంగా గడ్డకట్టింది. కుళాయిల్లో నీరు కూడా గడ్డకట్టుకుపోతోంది. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో మైనస్ 2 డిగ్రీలు, పంజాబ్‌లోని బటిండాలో 1.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మైదాన ప్రాంతాల్లో కూడా సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కురుస్తున్న మంచు కారణంగా ఉత్తర భారతమంతటా శీతల గాలులు (Cold winds) వీస్తున్నాయి. దీంతో అధికారులు స్పందిస్తూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






