సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్‌.. అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేలా భారీ వ్యూహం

by Malleboina Mahesh |

ప్రపంచ పెట్టుబడులకు కేరాఫ్ అయిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు సర్వం సిద్ధమైంది.

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్‌.. అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేలా భారీ వ్యూహం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచ పెట్టుబడులకు కేరాఫ్ అయిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు సర్వం సిద్ధమైంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ ఈ ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది. ఈ వేదిక నుంచి మరోసారి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బృందం గతేడాది దావోస్ వేదికగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించిన విషయం తెలిసిందే. ఈ సారి గతం కన్నా ఎక్కువ పెట్టుబడులు రాబట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం దావోస్ టూర్‌కు వెళ్తున్నది. ఈ సారి జరిగే టూర్‌ను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ గేట్‌వేగా వినియోగించుకోవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది.

నేడు దావోస్‌కు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం

నేటి నుంచి 23వ తేదీ వరకూ దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సోమవారం దావోస్‌కు వెళ్లనుంది. దావోస్‌లో జరిగే సదస్సు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, కార్పొరేట్ దిగ్గజాలు, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ నాయకులు, విధాన రూపకర్తలు కలిసే అత్యంత ప్రభావవంతమైన వేదిక. పెట్టుబడుల ఒప్పందాలు, భాగస్వామ్యాలు, భవిష్యత్ ఆర్థిక వ్యూహాలపై ఇక్కడ చర్చలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం రెండు పర్యటనల్లో ఈ వేదికను సమర్థవంతంగా వినియోగించుకుని రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా నిలబెట్టింది. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో మూడో పర్యటనను మరింత వ్యూహాత్మకంగా ప్లాన్ చేసింది. ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం ఏఐ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు బహుముఖ ఎజెండాతో సాధారణ ప్రెజెంటేషన్‌తో కాకుండా రంగాలవారీగా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లేందుకు ప్రిపేర్ అయ్యింది.

నాలుగు కీలక రంగాలపై ఫోకస్

దావోస్ సదస్సు నేపథ్యంలో రాష్ట్రంలోని రేవంత్ సర్కారు ప్రధానంగా నాలుగు కీలక రంగాలపై ఫోకస్ పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో హైదరాబాద్‌ను దేశంలోనే ప్రముఖ ఏఐ హబ్‌గా నిలబెట్టే దిశగా గ్లోబల్ టెక్ సంస్థల ఆర్అండ్‌డీ కేంద్రాలు, డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్‌ఫ్రా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. సెమీకండక్టర్-ఎలక్ట్రానిక్స్ రంగంలో చిప్ డిజైన్ సెంటర్లు, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు, సప్లై చైన్ భాగస్వామ్యాలపై ప్రత్యేక చర్చలు జరుపనుంది. భారత సెమీకండక్టర్ ఎకో సిస్టమ్‌లో తెలంగాణను కీలక కేంద్రంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆశయమని చాలా సందర్భాల్లో సర్కారు వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ వేదికగానూ ఇదే అంశాన్ని ప్రకటించింది.

అదే విధంగా గ్రీన్ ఎనర్జీ అండ్ ఈవీ రంగంలో సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ యూనిట్లు, బ్యాటరీ ప్లాంట్లు, చార్జింగ్ మౌలిక సదుపాయాలపై ఒప్పందాలు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్టప్ ఎకో సిస్టమ్ రంగంలో అంతర్జాతీయ వెంచర్ క్యాపిటల్ సంస్థలు, గ్లోబల్ యాక్సిలరేటర్లు, టెక్ ఇంక్యుబేటర్లతో భాగస్వామ్యాలు ఏర్పరచి తెలంగాణ స్టార్టప్ లకు ప్రపంచ వేదిక కల్పించేందుకు చర్యలు చేపడుతున్నది. ఫార్మా-లైఫ్ సైన్సెస్ రంగంలో బయోటెక్ పరిశోధనా కేంద్రాలు, డ్రగ్ రీసెర్చ్ ల్యాబ్స్, మెడికల్ ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటు దిశగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దావోస్ పర్యటనకు వెళ్లనున్నది.

సీఎం ఆధ్వర్యంలో హై ప్రొఫైల్ మీటింగ్స్

అంతర్జాతీయ స్థాయిలో కంపెనీల దృష్టిని తెలంగాణ వైపు మరల్చేలా ప్రభుత్వం దావోస్ వేదికగా చర్యలు తీసుకోనుంది. ఇందుకు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. తెలంగాణ గేట్‌వే టూ ఇండియాస్ ఫ్యూచర్ ఎకానమీ అంశాన్ని థీమ్‌గా ఎంచుకున్నది. ఈ ప్రెజెంటేషన్‌లో హైదరాబాద్ ఐటీ విజయగాథ, ఫార్మా క్యాపిటల్‌గా రాష్ట్ర స్థానం, మౌలిక సదుపాయాల పురోగతి, పరిశ్రమలకు సులభమైన అనుమతులు, పెట్టుబడిదారులకు పారదర్శక విధానాలను అందించడంపై వివరించనున్నారు. సీఎం నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం దావోస్‌లో వరుసగా గ్లోబల్ సీఈవోలు, బహుళజాతి కంపెనీల ప్రతినిధులు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో ముఖాముఖి భేటీలు నిర్వహించనుంది. కొన్ని కీలక కంపెనీలతో ముందస్తు సమావేశాలు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

గత రెండు దావోస్ పర్యటనల్లోనూ రాష్ట్రానికి భారీ పెట్టుబడి ప్రతిపాదనలు సాధించారు. దీంతో రాష్ట్రానికి ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ స్టేట్ అనే ఇమేజ్ లభించింది. ఈసారి వాటిని ఒప్పందాలుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుంది. గత అనుభవాల ఆధారంగా ఈసారి ప్రభుత్వం మూడు ప్రధాన వ్యూహాలను అమలు చేయనున్నట్లు తెలిసింది. రెడీ ప్రాజెక్ట్ జాబితాలో భాగంగా ఖాళీ ప్రతిపాదనలు కాకుండా అమలుకు సిద్ధమైన ప్రాజెక్టులతో వెళ్లడం, ఫాలోఅప్ మెకానిజంలో భాగంగా దావోస్ తర్వాత ఒప్పందాల అమలుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు, ఫాస్ట్‌ట్రాక్ అనుమతులు ఇవ్వడంలో భాగంగా పెట్టుబడులకు వేగవంతమైన క్లియరెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

భవిష్యత్ ఆర్థిక వ్యూహానికి కీలకం

దావోస్ పర్యటన ద్వారా భారీ విదేశీ పెట్టుబడులు, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపన, వేలాది ఉద్యోగాల ఏర్పాటు, ఎగుమతుల పెరుగుదల, టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వృద్ధి జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నది. మరోవైపు.. దావోస్ పర్యటనను భవిష్యత్ ఆర్థిక వ్యూహానికి కీలకంగా భావిస్తోంది. మొత్తానికి సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో మరోసారి తెలంగాణ సత్తా చాటేలా దావోస్ పర్యటనను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. రాష్ట్రానికి ఇతర దేశాలతోని పోటీ అని పదే పదే ప్రభుత్వ పెద్దలు చెబుతూ వస్తున్నారు. దానికి అనుగుణంగా మరిన్ని ఇంటర్నేషనల్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చి వరల్డ్ వైడ్ తెలంగాణ పేరు చాటిచెప్పాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.

Next Story