భారీగా తగ్గుతున్న చైనా జనాభా.. అనుకూలమా? ప్రతికూలమా?

by Muthe.Rajitha |

చైనా ప్రస్తుతం తీవ్రమైన జనాభా సమస్యను ఎదుర్కొంటోంది.

భారీగా తగ్గుతున్న చైనా జనాభా.. అనుకూలమా? ప్రతికూలమా?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటైన చైనా ప్రస్తుతం తీవ్రమైన జనాభా సమస్యను ఎదుర్కొంటోంది. చైనా ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. 2025 సంవత్సరం చివరికి చైనా మొత్తం జనాభా 140.4 కోట్లకు (1.404 బిలియన్) చేరుకుంది. ఇది 2024తో పోలిస్తే సుమారు 30 లక్షలు తగ్గినట్టు స్పష్టం చేస్తోంది. వరుసగా నాలుగో సంవత్సరం కూడా చైనాలో జనాభా తగ్గుదల నమోదు కావడం గమనార్హం.

జననాల కంటే మరణాలు ఎక్కువ

2025లో చైనాలో జననాల సంఖ్య కేవలం 79.2 లక్షలుగానే నమోదైంది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 17 శాతం తక్కువ. ప్రతి వెయ్యి మందికి జనన రేటు 5.63కి పడిపోయింది. ఇది 1949 తర్వాత చైనాలో నమోదైన అతి తక్కువ స్థాయి. అదే సమయంలో మరణాల సంఖ్య 11.31 మిళియన్లకు చేరింది. దీంతో ప్రతి వెయ్యి మందికి మరణ రేటు 8.04కి పెరిగింది. జననాల కంటే మరణాలు ఎక్కువగా ఉండటం వల్లే జనాభా తగ్గుతోంది.

కొంపముంచిన 'వన్ చైల్డ్ పాలసీ'

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పరిస్థితికి ప్రధాన కారణం గతంలో అమలు చేసిన వన్‌ చైల్డ్ పాలసీ. 1979 నుంచి 2015 వరకు ఒకే సంతానం విధానం అమల్లో ఉండటంతో ఇప్పుడు దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 2016లో టూ చైల్డ్ పాలసీ, 2021లో థ్రీ చైల్డ్ పాలసీ తీసుకొచ్చినా జననాలు పెరగలేదు. దీనికి తోడు జీవన ఖర్చులు పెరగడం, ఉద్యోగ ఒత్తిడి, యువత పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకోవడం, మహిళలు ఉద్యోగాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వంటి సామాజిక మార్పులు కూడా జనన రేటు తగ్గడానికి కారణమవుతున్నాయి. 2025లో వివాహాల సంఖ్య కూడా భారీగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

జీడీపీ ఢమాల్

ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే చైనాలో సంతానోత్పత్తి రేటు చాలా తక్కువగా ఉంది. దక్షిణ కొరియాలో ఫెర్టిలిటీ రేటు 0.78, జపాన్‌లో 1.26, భారత్‌లో 2.0 ఉండగా, చైనాలో అది 1.09కి పడిపోయింది. నిపుణులు దీనిని "డెమోగ్రాఫిక్ క్రైసిస్"గా అభివర్ణిస్తున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే 2030 నాటికి చైనా జీడీపీ వృద్ధి 3 శాతం వరకే పరిమితమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

పెరుగుతున్న వృద్ధుల జనాభా.. ఆ రంగాలు కుదేలు

చైనా ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య వృద్ధుల జనాభా పెరుగుదల. 2025 నాటికి చైనాలో 60 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 323 మిలియన్లకు చేరింది. ఇది మొత్తం జనాభాలో సుమారు 23 శాతం. దీనివల్ల పని చేసే యువ జనాభా తగ్గిపోతుంది. కార్మికుల కొరత ఏర్పడి, పరిశ్రమలు, ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్ రంగం దెబ్బతింటుంది. పెన్షన్ వ్యవస్థలపై కూడా తీవ్ర భారం పడనుంది.

ఈ క్రైసిస్ నుంచి బయటపడటం ఎలా?

ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చైనా ప్రభుత్వం పన్ను రాయితీలు, పిల్లల సంరక్షణకు సబ్సిడీలు, ఉచిత కిండర్‌గార్టెన్ విద్య వంటి ప్రోత్సాహకాలు ఇస్తోంది. అయినా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలు సరిపోవు. జీవన ఖర్చులు తగ్గించడం, మహిళలకు కుటుంబం–ఉద్యోగం మధ్య సమతుల్యం కల్పించడం, దీర్ఘకాలిక సామాజిక సంస్కరణలు తీసుకురావడం అవసరం.

ప్రపంచంపై ఎఫెక్ట్ ఎంత?

చైనా జనాభా తగ్గుదల దేశ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ వంటి దేశాలు ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగి.. ప్రపంచ కొత్త ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ఈ క్రమంలో చైనా తన ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలంటే కొత్త వ్యూహాలతో ముందుకు రావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడే చైనా ఈ డెమోగ్రాఫిక్ క్రైసిస్‌ను అధిగమించగలదు.

Next Story