సొంతంగా 17 మున్సిపాలిటీల్లో గులాబీ జయకేతనం

by Malleboina Mahesh |

17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరగా.. వాయిదా పడ్డ చోట్ల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ఇన్‌చార్జిల నియామకంతో కేటీఆర్ దూకుడు పెంచారు.

సొంతంగా 17 మున్సిపాలిటీల్లో గులాబీ జయకేతనం
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజార్టీతో 17 పురపాలికలను కైవసం చేసుకున్నది. పోలింగ్ వేళ సాధించిన స్థానాలనే కాపాడుకోగలిగింది. మరో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడగా వాటిలో మరో 8 వరకు మున్సిపాలిటీలను దక్కించుకుంటామని పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికి ఎల్లంపేట, అలంపూర్, జమ్మికుంట, సిరిసిల్ల, ఇస్నాపూర్, తూప్రాన్, గజ్వేల్, దుబ్బాక, రాయికల్, ఆసిఫాబాద్, అయిజ, గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, మూడుచింతలపల్లి, చేర్యాల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేసింది.

కాగా ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్‌, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరులో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అయితే.. వీటిలో క్యాతనపల్లి, ఇంద్రేశం, జహీరాబాద్, ఇబ్రహీంపట్నం, జనగామ, తొర్రూరు, ఖానాపూర్, కాగజ్‌నగర్ స్థానాలు తమకే దక్కుతాయని పార్టీ ఆశలు పెట్టుకున్నది.

హంగ్ స్థానాలకు ఇన్‌చార్జిల నియామకం..

మరోవైపు హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా ఎన్నికల ఇన్‌చార్జిలను నియమించారు. ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు తమకు కేటాయించిన మున్సిపాలిటీలకు బయలుదేరి వెళ్లారు. తొర్రూరు మున్సిపాలిటీకి ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని నియమించారు.

జనగామకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, క్యాతనపల్లికి ఎమ్మెల్యే కోవాలక్ష్మి, ఖానాపూర్‌కు ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఇంద్రేశంకు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కాగజ్‌నగర్‌కు మాజీమంత్రి జోగు రామన్న, జహీరాబాద్‌కు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునితా లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నంకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును నియమించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఈ ఎనిమిది మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని, కాంగ్రెస్ ఎన్ని కుతంత్రాలు చేసినా తమ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకోలేరని పార్టీ ధీమా వ్యక్తం చేసింది.

Next Story