బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బహిష్కరణ

by Malleboina Mahesh |   (  Updated:2026-01-25 08:49:50  IST  )

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (BRS) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌ను బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది.

బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బహిష్కరణ
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (BRS) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌ (ABN Andhra Jyothi Channel)ను బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 23న సదరు ఛానెల్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు (MLC Takkalpalli Ravinder Rao) పట్ల ఆ ఛానెల్ ప్రతినిధి వెంకటకృష్ణ (Venkatakrishna) వ్యవహరించిన తీరును పార్టీ తీవ్రంగా ఖండించింది.

గౌరవ శాసన మండలి సభ్యుడిని ఉద్దేశించి "గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్" అనడం కనీస పత్రికేయ విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీఆర్ఎస్ మండిపడింది. తమ పార్టీ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆంధ్రజ్యోతి ఛానల్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పార్టీ డిమాండ్ చేసింది. అలాగే ఆంధ్రజ్యోతి వైఖరిలో మార్పు రాకపోవడాన్ని గమనించిన పార్టీ నాయకత్వం, ఇకపై ఆ ఛానెల్ నిర్వహించే ఎలాంటి చర్చా కార్యక్రమాల్లోనూ బీఆర్ఎస్ నాయకులు పాల్గొనకూడదని కఠిన నిర్ణయం తీసుకుంది.

కేవలం చర్చలకే పరిమితం కాకుండా, పార్టీ ప్రధాన కార్యాలయం అయిన తెలంగాణ భవన్‌తో పాటు రాష్ట్రంలోని ఏ జిల్లా కార్యాలయాల్లో జరిగే పార్టీ సమావేశాలకు కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులను అనుమతించకూడదని పార్టీ నిర్ణయించింది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లే విధంగా కథనాలు ప్రసారం చేయడం, పార్టీ నాయకత్వం పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం వంటి చర్యలను ఇకపై సహించేది లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ స్పష్టం చేశారు.

Next Story