ఇరకాటంలో బీఆర్ఎస్.. కేసులు, నోటీసులు, విచారణలతోనే రెండేళ్లు

by Malleboina Mahesh |

భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రతిపక్ష కాలం కాస్త కేసులు, నోటీసులు, విచారణలతోనే సాగిపోతున్నట్లు కనిపిస్తుంది.

ఇరకాటంలో బీఆర్ఎస్.. కేసులు, నోటీసులు, విచారణలతోనే రెండేళ్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రతిపక్ష కాలం కాస్త కేసులు, నోటీసులు, విచారణలతోనే సాగిపోతున్నట్లు కనిపిస్తుంది. ఒక కేసు కాకపోతే మరో కేసు, ఒక నేత కాకపోతే మరో నేత ఇలా కేసులు, నోటీసులు, విచారణలతోనే కాలం ముగిస్తున్నది. పార్టీ కేడర్, నాయకులను ఇబ్బంది పెట్టేలా.. ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా కొద్ది గ్యాప్ లోనే ఏదో ఒక కేసు వచ్చిపడుతున్నది. మొదట కాళేశ్వరం కమిషన్, ఈ ఫార్ములా కారు రేస్ కేసు, ఫోన్​ట్యాపింగ్.. ఇలా వరుసగా బీఆర్ఎస్ అగ్రనేతలు కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు స్థానిక నాయకులపై కేసులు ఎక్కడిక్కడే ఉంటూనే ఉన్నాయి. దీంతో పాటు కేసుల విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి.

పార్టీ ముఖ్య నాయకులు సైతం ఎప్పటికప్పుడు కేసులు, విచారణలతో తమకు సంబంధం లేదని, ఎన్ని విచారణలైనా ఎదుర్కొంటామని ప్రకటించాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రతిపక్షం పై దాడి అని పేర్కొంటున్నా.. ప్రతిసారి ఇవే చెబుతూ పోతే ప్రజలు వాటిని అంత సీరియస్​గా తీసుకునే అవకాశం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం సైతం టీఆర్ఎస్ ​నాయకులపై ఉన్న కేసుల విషయంలో ఎక్కడా ఇంత వరకు అరెస్టులు చేయలేదు. దీంతో ఇటు అరెస్టు చేయకుండా మరోవైపు మాత్రం విచారణలు, నోటీసులు అంటూ మానసికంగా వేధించే పనిని చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అరెస్ట్​చేస్తే సస్పెన్స్​ ఏమంటుంది అంటూ అధికార పార్టీ నాయకులు వాదిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులకు ఇదో రకమైన మానసిక వేదనగా అభివర్ణిస్తున్నారు.

రెండేళ్లు పూర్తి!

గత ఏడాది కాలంగా స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడు ఇప్పుడు అంటూ సాగడంతో పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల నియామకం ఆలస్యమవుతూ వస్తున్నది. ఎన్నికల పేరుతో సంవత్సరం కాలం గడిచిపోయింది. ప్రతిపక్షంగా ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయింది. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి ఈ సమయం ఎంతో కీలకమైంది. అలాంటి సమయాన్ని వృథా చేసుకుంటున్నారనే ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఏదో కేసు, అరెస్టులు అంటూ ప్రచారం జరగడం, పార్టీకి చెందిన ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా కేంద్ర కార్యాలయానికి తరలిరావడం, రోజంతా అక్కడ ఉండటం, ఆ తర్వాత ఏమీ లేకపోవడం పరిపాటిగా మారిందని చెబుతున్నారు. ఒక్కోసారి అధికార వ్యూహంలో ప్రతిపక్షంగా మనం పడుతున్నామా? అనే అనుమానాన్ని సైతం కొందరు బీఆర్ఎస్​నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

బహిరంగంగా చెప్పుకోలేక పోయినా ఇది వాస్తవమని పేర్కొంటున్నారు. ఈ వాదనతో విభేదించే వారు సైతం ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అధికార పార్టీ బెదిరింపులకు భయపడటం లేదని, అందరం ఐక్యంగా ఉన్నామని చెప్పడానికి నిదర్శనం గా చెబుతున్నారు. ఏదేమైనా ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి సారించాల్సిన సమయంలో కేసులు, నోటీసులు, విచారణలు, అరెస్టు అంటూ జరుగుతున్న ప్రచారాలపైనే దృష్టి పెట్టడం ఇబ్బందికరమనే వాదనలు వినిపిస్తున్నాయి. కింది స్థాయిలో ఇదే అంశాలపై చర్చ రావడం ద్వారా ప్రజలు అధికార పార్టీ హామీలపై కాకుండా ప్రతిపక్షాల విచారణలపై చర్చించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story