నలుగురు కీలక మంత్రులపై రేవంత్ రెడ్డి కుట్ర: బీఆర్ఎస్

by Gantepaka Srikanth |

రేవంత్‌రెడ్డి.. మీరు తెలంగాణ ముఖ్యమంత్రా? లేక ఫ్యాక్షన్ ముఠా నాయకుడా?’ అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.

నలుగురు కీలక మంత్రులపై రేవంత్ రెడ్డి కుట్ర: బీఆర్ఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘రేవంత్‌రెడ్డి.. మీరు తెలంగాణ ముఖ్యమంత్రా? లేక ఫ్యాక్షన్ ముఠా నాయకుడా?’ అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం వారు అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి పాతిపెట్టండి, బొంద పెట్టండి, దిమ్మలు కూల్చండి వంటి హింసాత్మక పదజాలం వాడటం చూస్తుంటే ఓ ఫ్యాక్షన్ ముఠా నాయకుడిలా కనిపిస్తున్నారని విమర్శించారు. ఇది కేవలం రాజకీయ ప్రసంగం కాదని.. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ఒక పక్కా నేరపూరిత కుట్ర అని ధ్వజమెత్తారు. అధికారం కాంగ్రెసే కానీ, ఆత్మ మాత్రం టీడీపీదే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జెండా కప్పుకుని, లోపల తన పాత యజమాని చంద్రబాబునాయుడి ఎజెండాను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.

ప్లాన్-బీలో భాగంగా టీడీపీని మళ్లీ లేపేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని, ఇది ఒక రకమైన రాజకీయ వ్యభిచారం అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారిని క్రమపద్ధతిలో బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ అధిష్టానానికి పంగనామాలు పెడుతూ, ఇటు టీడీపీతో, అటు బీజేపీతో కోవర్ట్ సంబంధాలు నెరుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలవుతున్నా, సంపద సృష్టించే తెలివి లేక ఫ్యూచర్ సిటీ, 5 ట్రిలియన్ ఎకానమీ అంటూ రేవంత్ ప్రజలకు రంగుల కలలు చూపిస్తున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో ఉండి, పెద్దపెద్ద మాటలు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. అధికారం శాశ్వతం కాదని.. అహంకారమే వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story