ఆందోళన తగ్గించే 'బ్రీతింగ్ కుషన్'!

by Disha Web Desk 17 |
ఆందోళన తగ్గించే బ్రీతింగ్ కుషన్!
X

దిశ, ఫీచర్స్ : ఆందోళనకు గురైనప్పుడు చాలా మంది వ్యక్తులు కుషన్ వంటి మెత్తటి వస్తువులను కౌగిలించుకుంటారు. అలా చేయడం ద్వారా ఆందోళన తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మేరకు యూకేలోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం శ్వాస పీల్చుకున్నట్లుగా భావించే మృదువైన దిండును అభివృద్ధి చేసింది.

పెంపుడు జంతువులను, ఇష్టమైన వ్యక్తులను హగ్ చేసుకోవడం వంటి అనుభూతిని అందించేలా ఈ 'బ్రీతింగ్ కుషన్స్' రూపొందించగా.. వీటిని పట్టుకోవడం ద్వారా ఆందోళన నుంచి బయటపడవచ్చు. ఈ మేరకు పరిశోధకుల బృందం 24 మంది విద్యార్థులపై తొలి టెస్ట్ నిర్వహించారు. కుషన్‌ను హగ్ చేసుకున్నప్పుడు వాళ్లు అత్యంత ఆహ్లాదకరంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధ్యయన తదుపరి దశ కోసం 129 మంది ఇతర వాలంటీర్లపై దీన్ని పరీక్షించారు. ఇందుకోసం మ్యాథ్స్ టెస్ట్ ద్వారా వారిలో ముందుగా ఆందోళన భావాలను ప్రేరేపించారు. ఈ మేరకు ఎగ్జామ్‌కు ఎనిమిది నిమిషాల ముందు 44 మందిని సైలెంట్‌గా కూర్చోమని, మరో 40 మందిని ధ్యానం-ఆధారిత శ్వాస వ్యాయామం చేయమని, ఇంకో 45 మందిని బ్రీతింగ్ కుషన్ హగ్ చేసుకోమని సూచించారు. కాగా ఈ పరీక్షకు ముందు, తర్వాత వాలంటీర్ల ఆందోళన స్థాయిలను పరిశీలించగా.. ఏమీ చేయకుండా సైలెంట్‌గా కూర్చున్న గ్రూప్‌తో పోల్చితే కుషన్-హగ్గింగ్, మెడిటేషన్ గ్రూపులు చాలా తక్కువ ఆత్రుతతో ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా కుషన్‌ను హగ్ చేసుకోవడం ద్వారా ఒత్తిడి/ఆందోళన లక్షణాలు తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో వినియోగదారుల ప్రతిస్పందనలపై మరింత వివరణాత్మక డేటాను సేకరించి, మెకానికల్ కుషన్‌ను మరింత మెరుగుపరచాలని భావిస్తున్నారు.






Next Story

Most Viewed