బోర్డ్ ఆఫ్ పీస్.. ఎంట్రీ ఫీజు 1 బిలియన్ డాలర్లు

by Muthe.Rajitha |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా పునర్నిర్మాణం, శాంతి ప్రక్రియల కోసం "బోర్డ్ ఆఫ్ పీస్"ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

బోర్డ్ ఆఫ్ పీస్.. ఎంట్రీ ఫీజు 1 బిలియన్ డాలర్లు
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా పునర్నిర్మాణం, శాంతి ప్రక్రియల కోసం "బోర్డ్ ఆఫ్ పీస్"ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ బోర్డులో సభ్యత్వం పొందాలంటే భారీగా ఎంట్రీ ఫీజు చెల్లించాలని తెలుస్తోంది. బోర్డ్ ఆఫ్ పీస్‌లో (Board of Peace) శాశ్వత సభ్యత్వం కావాలంటే ఆయా దేశాలు 1 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.8,300 నుంచి 9,000 కోట్ల వరకు చెల్లించాలని ప్రతిపాదించడం ప్రస్తుతం పెద్ద వివాదంగా మారింది. అమెరికా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సాధారణ సభ్యత్వానికి ఎలాంటి ఫీ ఉండదు కానీ అది మూడు సంవత్సరాలకు మాత్రమే పరిమితమని తెలిపారు.

ఇక శాశ్వత సభ్యత్వం కావాలంటే తొలి ఏడాదిలోనే ఈ భారీ మొత్తాన్ని నగదుగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ డబ్బును గాజా పునర్నిర్మాణానికి వినియోగిస్తామని వైట్ హౌస్ చెబుతోంది. ట్రంప్ దాదాపు 60 దేశాలకు ఆహ్వానాలు పంపగా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ, యుఏఈ, జోర్డాన్, హంగరీ, వియత్నాం వంటి దేశాలు అందులో ఉన్నాయి. అయితే కొన్ని దేశాలు ఇప్పటికే ఎంట్రీ ఫీజు చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ బోర్డ్‌కు ట్రంప్ శాశ్వత ఛైర్మన్‌గా ఉండి, కీలక నిర్ణయాలపై వీటో అధికారం కలిగి ఉంటారని సమాచారం.

అయితే ఇది ఐక్యరాజ్యసమితిని పక్కనపెట్టే ప్రయత్నమని, శాంతి పేరుతో డబ్బు వసూలు చేయడమేనని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ కూడా బోర్డ్ నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. పాకిస్తాన్ వంటి దేశాలు చేరడం వల్ల ఇజ్రాయెల్ వ్యతిరేక దేశాల ప్రభావం పెరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి. సోషల్ మీడియాలో కొందరు దీనిని "ట్రంప్ డిప్లొమసీ క్లబ్", "1 బిలియన్ డాలర్లకు శాంతి”అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

ట్రంప్ మాత్రం దీన్ని ప్రపంచంలోనే అత్యంత గొప్ప, ప్రతిష్ఠాత్మక బోర్డ్‌గా వర్ణిస్తూ, గాజా పునర్నిర్మాణం, తాత్కాలిక పాలన వంటి అంశాలపై దృష్టి పెడతామని చెబుతున్నారు. అయితే ఈ ఫీని నిజంగా ఎన్ని దేశాలు చెల్లిస్తాయో, బోర్డ్ ఎలా పనిచేస్తుందో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా భారత్ ఈ ఫీజు చెల్లించిందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Next Story