కేసీఆర్ గడ్డపై బీజేపీ ఫోకస్.. ఈటలకు టచ్‌లో కీలక నేతలు!

by Disha Web Desk 2 |
కేసీఆర్ గడ్డపై బీజేపీ ఫోకస్.. ఈటలకు టచ్‌లో కీలక నేతలు!
X

గజ్వేల్ గడ్డపై కాషాయదళం దృష్టి సారించింది. సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గాన్ని వీడనన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో బీజేపీ బలోపేతం, టీఆర్ఎస్ పతనమే లక్ష్యంగా కమలం పార్టీ 'ఆపరేషన్ గజ్వేల్' చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను రంగంలోకి దింపింది. పౌల్ట్రీ వ్యాపారం, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ నియోజకవర్గంతో ఈటలకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేయాలని ఈటల సన్నిహితులు, పార్టీ అధిష్టానం సూచిస్తుంది. దీంతో అసలు గజ్వేల్‌లో ఏం జరుగుతోంది? తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఎంటి? టీఆర్ఎస్ తీవ్ర అన్యాయానికి గురైన నేతలు ఎవరూ అని ఆరా తీస్తున్నారు. గజ్వేల్ ముఖ్య నేతలందరూ ఈటలకు నేటికీ టచ్‌లోనే ఉన్నారు. ఇటీవల మనోహరాబాద్ మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈటల సమక్షంలో బీజేపీలో చేరడమే ఇందుకు నిదర్శనం. మొత్తం వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌పై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అటు బీజేపీ అధిష్టానం, ఇటు ఈటల పావులు కదుపుతున్నారు.

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: తాను వ్యాపార పరంగా, రాజకీయంగా రంగం ప్రవేశం చేసిన గజ్వేల్ నియోజకవర్గంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రత్యేక దృషి సారించారు. గజ్వేల్‌లో ఏం జరుగుతుంది..? రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులు ఏం చేస్తున్నారు..? టీఆర్ఎస్‌లో తీవ్ర అన్యాయానికి గురైన పార్టీ శ్రేణుల పరిస్థితి ఏమిటి..? అని తన సన్నిహితులతో రోజు వారీగా చర్చిస్తున్నారు. గజ్వేల్ టీఆర్ఎస్‌కు చెందిన చాలామంది ముఖ్య నాయకులు హైదరాబాద్‌లో ఈటల ఇంటికి వెళ్లి కలిసి వస్తున్నారు. ఇతర రహస్య ప్రాంతాల్లో కూడా కలిసి గంటల తరబడి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మనోహరాబాద్​ మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈటల సమక్షంలో బీజేపీలో చేరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హుజురాబాద్​ఎమ్మెల్యే అయినప్పటికీ గజ్వేల్​ పైనే ఆయన ప్రధాన దృష్టి సారించడం రాజకీయ వర్గాల్లో హాట్​టాపిక్‌గా మారింది. గజ్వేల్‌లో ఈటల తన పటిష్టమైన నెట్ వర్క్‌ను తయారు చేస్తున్నారని, టీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా ఆయనకు టచ్‌లో ఉన్నారని బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. రాజేందర్‌ను గజ్వేల్​ నుంచి పోటీచేయాలని సన్నిహితులు ఒత్తిడి చేస్తుండగా, పార్టీ అధిష్టానం కూడా ఈటలకు ఇదే సూచన చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గజ్వేల్​టీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుందని ఆసక్తికర చర్చ జరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌ను వీడనున్నట్లు జరుగుతున్న ప్రచారంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

వర్గల్ నుంచే పౌల్ట్రీ వ్యాపారంలోకి..

ఈటల రాజేందర్ తన ఫౌల్ట్రీ వ్యాపారాన్ని గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ నుంచే మొదలు పెట్టారు. 2001 నుంచే ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. వర్గల్‌లో వ్యాపారం చూసుకొని రోజు గజ్వేల్ టౌన్‌కు చేరుకునే వారు. ఇక రాత్రి వరకు టీఆర్ఎస్ నాయకులతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంపై చర్చలు జరిపేవారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్ పూర్, తూప్రాన్​మండలాల్లలో విస్తృతంగా పర్యటించారు. అన్ని గ్రామాల్లో ఈటల అభిమానులు ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ఈటల బీజేపీలో చేరినప్పటికీ టీఆర్ఎస్‌కు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు మాత్రం ఈటల అంటే ఇప్పటికీ అదే అభిమానం ఉన్నదని చెప్పుకోవచ్చు. గజ్వేల్ కేంద్రంగానే అటు వ్యాపారం, ఇటు రాజకీయం చేయడంతో చాలామందికి ఆయన గజ్వేల్ స్థానికుడిగానే తెలుసు. అయితే రాష్ట్రం ఏర్పడిన తరువాత హుజురాబాద్​వెళ్లిపోవడంతో గజ్వేల్‌కు రాకపోకలు తగ్గాయి. టీఆర్ఎస్‌లో సీనియర్ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసిన ఆయన టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. భూమి వ్యవహారంలో ఆక్రమణదారుడిగా ముద్రపడినప్పుడు కూడా స్థానిక టీఆర్ఎస్ నేతలు ఆయనకు ఫోన్లు చేసి అండగా నిలిచారు కూడా.

గజ్వేల్‌లో నెట్ వర్క్ పెంచుకున్న ఈటల

ఈటల రాజేందర్ గజ్వేల్‌లో తన నెట్ వర్క్ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే రోజువారీగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో స్వయంగా మాట్లాడుతున్నారు. ఆయన ఇంటికి కూడా చాలామంది వెళుతున్నారు. పెళ్లి, ఇతర విందు కార్యక్రమం గురించి చెప్పడానికి వచ్చామని బయటకు చెబుతున్న టీఆర్ఎస్ నాయకులు కేవలం ఈటలను కలుసుకోవడానికి వెళుతున్నారు. టీఆర్ఎస్‌లో పరిస్థితి బాగా లేదు. ఈటలతో టచ్‌లో ఉంటే ఎందుకైనా మంచిందని వచ్చానని ఇటీవల రాజేందర్​రెడ్డి ఇంటివద్ద కనిపించిన గజ్వేల్‌కు చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడు పేర్కొనడం గమనార్హం. నేను ఒక్కటినే కాదు అందరూ వచ్చి వెళుతున్నారంటూ ఆ నాయకుడు కుండబద్దలు కొట్టాడు. హుజురాబాద్ వచ్చిపోయే క్రమంలో ప్రజ్ఞాపూర్, వర్గల్, వంటిమామిడిల వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాజేందర్‌ను కలుస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఇంటి వద్ద, ఇతర రహస్య ప్రాంతాల్లో ఈటలను కలుస్తున్న వారిలో గజ్వేల్ టీఆర్ఎస్ వాళ్లే ఎక్కవ మంది ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతుండడం గమనార్హం.

టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి...

బీజేపీ బలోపేతం, గజ్వేల్‌లో టీఆర్ఎస్ పతనం లక్ష్యంగా ఈటల రాజేందర్ వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఎర్రవల్లి సీఎం కేసీఆర్ ఫౌంహౌజ్‌లోని బావిలో కూలీకి వెళ్లిన ఓ యువకుడి పడి మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న రాజేందర్ వరదరాజ్‌పూర్‌లోని మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల మనోహరాబాద్ మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లో ఈటల సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిపోయారు. చాలామంది చేరడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. గజ్వేల్ నియోకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీలో తీవ్ర అన్యాయానికి గురయ్యారని వారంతా ఈటలతో టచ్‌లో ఉన్నారంటున్నారు. గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు సంతోషంగా లేరని, పార్టీతో పాటు అధిష్టానం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇదే అదనుగా ఈటల రాజేందర్​ వ్యూహాత్మంగా గజ్వేల్‌లో రాజకీయం మొదలు పెట్టారని టీఆర్ఎస్ నాయకుడు ఒకరు చెప్పారు. పదవులు పొందిన వారు కూడా ఈటలను కలిసివచ్చిన వారి జాబితాలో ఉన్నారని చెప్పారు. రానున్న రోజుల్లో గజ్వేల్ రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed