క్రీడాలోకం దిగ్భ్రాంతి.. హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన ఇద్దరు వర్ధమాన క్రీడాకారులు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-15 05:57:34  IST  )

హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ ఇద్దరు వర్ధమాన అథ్లెట్ల కనిపించడం క్రీడాలోకంలో సంచలనంగా మారింది. కేరళలోని కొల్లాంలో ఈ పెను విషాదం చోటుచేసుకుంది.

క్రీడాలోకం దిగ్భ్రాంతి.. హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన ఇద్దరు వర్ధమాన క్రీడాకారులు
X

దిశ, వెబ్ డెస్క్: హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ ఇద్దరు వర్ధమాన అథ్లెట్ల కనిపించడం క్రీడాలోకంలో సంచలనంగా మారింది. కేరళలోని కొల్లాంలో ఈ పెను విషాదం చోటుచేసుకుంది. స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) మహిళా హాస్టల్‌లో ఇద్దరు యువ క్రీడాకారిణులు అనుమానాస్పద స్థితిలో విగతజీవులుగా కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల్లో కోజికోడ్‌కు చెందిన 12వ తరగతి విద్యార్థిని, తిరువనంతపురానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ఉన్నారు. నేడు ఉదయం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్లకు వీరిద్దరూ వేలాడుతూ కనిపించడంతో తోటి క్రీడాకారిణులు, సిబ్బంది షాక్‌కు గురయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు వర్ధమాన క్రీడాకారిణులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం క్రీడా లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ ఘోర ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే కొల్లాం సిటీ పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ, వారి మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం కొల్లాం ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. హాస్టల్ గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని సమాచారం. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్న ఈ విద్యార్థినులు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు హాస్టల్ సిబ్బందిని, తోటి విద్యార్థులను విచారిస్తున్నారు.

Next Story