ఇదో బడా కథ!.. బడా పహాడ్ నిర్వహణంత ప్రైవేట్‌దే

by Disha Web Desk 12 |
ఇదో బడా కథ!.. బడా పహాడ్ నిర్వహణంత ప్రైవేట్‌దే
X

దిశ, బాన్సువాడ: అసలు జిల్లాలో అధికార యంత్రాంగం ఉందా? శాంతిభద్రతలకు భంగం కలుగుతుందా? ప్రైవేట్ మూకలు రాజ్య మేలుతున్నాయా? పట్టపగలే దోపిడీ జరుగుతోందా? దర్గా సాక్షిగా దోచుకుంటున్నారా? బడా దందాకు తెరలేపారా? సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టునే తప్పుదోవ పట్టించారా? ఉర్సు ఉత్సవాల హుండీకి గండి పడిందా? కానుకలు కాజేతకు గురయ్యాయా? వక్ఫ్ సొమ్మును వాటాలేసుసుకున్నారా? అంటే ప్రస్తుతం అవుననే సమాధానమే వినిపిస్తోంది. దీనిపై "దిశ "నిఘా తో కూడిన పరిశోధనాత్మక కథనం.

టెండర్లలో గోల్ మాల్

బడా పహాడ్ దర్గా నిర్వహణకు గత నెలాఖరున సీల్డ్ టెండర్లు హజ్ భవన్ టెండర్లు పిలిచింది. రెండు దఫాల్లో ఎవరు దరఖాస్తు చేసుకోలేదు. తర్వాత వ్యక్తిగతంగా దరఖాస్తులు స్వీకరించింది. దీనికి 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో వర్ని మండలంలోని జలాల్ పూర్ గ్రామానికి చెందిన షేక్ తజముల్ హుస్సేన్ రూ.3.01 కోట్లకు టెండర్ వేశారు. టెండర్ లో ఇదే అత్యధిక బిడ్ కానీ సమాచారమిచ్చిన టెండర్ ప్రక్రియకు హాజరు కాలేదని ఆయనను పరిగణనలోకి తీసుకోలేదు. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న ఇద్దరు కాంట్రాక్టర్లలో ఒకరు దరఖాస్తు విత్ డ్రా చేసుకోగా, మరొకరు చితికిన ఆర్థిక కారణాలు చూపి తప్పుకున్నారు.

నాలుగో స్థానంలో రూ.2.50 కోట్లకు టెండర్ వేసిన మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్ కు జనవరి 25న కాంట్రాక్ట్ అప్పగించింది హజ్ భవన్. టెండర్ లో మొదటి స్థానంలో ఉన్న తనకు సమాచారం ఇవ్వకుండా అల్తాఫ్ హుస్సేన్ కు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ షేక్ తజముల్ హుస్సేన్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం జనవరి 31న కాంట్రాక్ట్ నిర్వహణపై స్టే ఇచ్చింది. అనంతరం ఫిబ్రవరి 10న దర్గా నిర్వహణ వక్ఫ్ బోర్డు పరిధిలోకి తీసుకున్నట్టు బోర్డు రాసిచ్చింది. ఇక్కడే అసలు అక్రమాల కథ మొదలైంది. ప్రైవేట్ దోపిడీకి, అడ్డదారి వసూళ్లకు, హుండీ పక్కదారికి అడుగులు పడ్డాయి.

ప్రైవేట్ దోపిడీ ఎలాగంటే..

హజ్ భవన్ సీఈవోకు జిల్లా వక్ఫ్ బోర్డు 974/1 నంబరుతో కూడిన లెటర్‌ను హజ్ సీఈవో కార్యాలయానికి 2022 జనవరి 31న రాసింది. ఈ లెటర్ ప్రకారమే హజ్ అధికారులు హైకోర్టుకు ఫిబ్రవరి 10న హాజరయ్యారు. బడా పహాడ్ దర్గా నిర్వహణ నుంచి కాంట్రాక్టర్ ను తొలగించి, వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి తీసుకుందని రాత పూర్వకంగా తెలిపారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం, కాంట్రాక్టర్ తోనే దర్గా నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఈ అక్రమ నిర్వహణ సమాచారం "దిశ" కు రావడంతో దర్గా పై నిఘా నేత్రం పెట్టింది. లోతుగా పరిశీలన చేసింది. ఇందులో విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. అక్కడ జరుగుతున్న అక్రమాల బాగోతం బట్టబయలు అయ్యింది. అవేంటంటే..

*జనవరి 31 నుంచి దర్గా నిర్వహణ వక్ఫ్ బోర్డు చేపట్టాల్సి ఉన్న, ఇప్పటికీ కాంట్రాక్టరే చేపడుతున్నారు. హుండీల వద్ద వాళ్ళే ఉంటున్నారు.

*జనవరి రెండో వారంలో జరిగిన ఉర్సు ఉత్సవాల హుండీ, కానుకల లెక్క ఇంకా తేలలేదు. ఇవి రూ. కోటి పైననే ఉంటాయని తెలుస్తోంది.

*దర్గా నిర్వహణ వక్ఫ్ పరిధిలోకి వెళ్ళిన ఇప్పటికీ అద్దె ఇళ్ల యజమానులు, వ్యాపార సముదాయాల నిర్వాహకుల నుంచి కాంట్రాక్టర్ డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. హైకోర్టు స్టే విషయం పై ప్రశ్నిస్తే బాండ్ పేపర్ రాసిచ్చి, ఇళ్ల, దుకాణదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

*ఇప్పటికీ మేకల వధశాల డబ్బులు రసీదు ఇచ్చి వసూలు చేస్తున్నారు. ఒక్క మేకకు రసీదు పై రూ 260 నిర్ణయించి, క్షేత్ర స్థాయిలో రూ.360 వసూలు చేయడం జరుగుతుంది.

వీటికి సమాధానం చెప్పేదెవరు..?

*జనవరి 31 తర్వాత హుండీ డబ్బులు, బంగారం, వెండి గుర్రాల ప్రతిమల కానుకలు ఎన్ని వచ్చాయి.

*ఉర్సు ఉత్సవాల్లో వచ్చిన హుండీ, కానుకలు ఎన్ని.

* దర్గా వక్ఫ్ బోర్డు నిర్వహణలో ఉంటే, ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు దర్గా లో వసూళ్లు చేస్తున్నారు.

* వక్ఫ్ అధికారులు ఇంకా కాంట్రాక్టర్ నిర్వహణకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు.

*పట్ట పగలే దర్గా లో ఇంత ప్రైవేట్ పెత్తనం జరుగుతున్నా జిల్లా కలెక్టర్ సహా, అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదు.

* సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇలాఖాలో, ఆయన వ్యతిరేకించిన కాంట్రాక్ట్ నిర్వహణ వ్యవస్థకు ప్రజా ప్రతినిధులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు.

* ఎవరి అండతో కాంట్రాక్టర్ దర్గా ను అక్రమంగా, అనాధికారికంగా ఏలుతున్నాడు.

*ఇళ్లు, దుకాణ వ్యాపారుల నుంచి వసూలు చేసిన, ఇంకా చేస్తున్న డబ్బులు కాంట్రాక్టర్ నుంచి ఎవరు ఇప్పిస్తారు.

*వక్ఫ్ బోర్డు పరిధిలోకి వెళ్లిందని తెలిసినా, కాంట్రాక్టర్ ఇలా డబ్బులు వసూలు చేస్తున్న, వక్ఫ్ ఎందుకు పట్టించుకోవడం లేదు. సదరు కాంట్రాక్టర్ పై ఇప్పటికీ పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు. ఇవన్నీ లెక్కలు తేలాలంటే లోతైన విచారణ జరగాల్సిందే. కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే.


Next Story