ఏసీ ప్రియులకు బ్యాడ్ న్యూస్: 15% వరకు పెరగనున్న ధరలు!

by Malleboina Mahesh |

రాగి ధరలు పెరగడం, కొత్త ఎనర్జీ నిబంధనల వల్ల ఏసీల ధరలు 5-15% పెరగనున్నాయి. వోల్టాస్ ఎండీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వేసవిలో అమ్మకాలు కూడా 20% పెరిగే అవకాశం ఉంది.

ఏసీ ప్రియులకు బ్యాడ్ న్యూస్: 15% వరకు పెరగనున్న ధరలు!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది వేసవి కాలం రాకముందే ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ శాఖ (Department of Meteorology) అంచనాల ప్రకారం గతంతో పోలిస్తే.. భారీగా ఎండల తీవ్రత ఉండనుంది. ఈ క్రమంలో ఎండ వేడి నుంచి రక్షించుకునేందుకు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఏసీ (AC)లు కొనుక్కొవాలనే ప్రణాళికల్లో ఉన్నారు. అలాంటి వారికి తాజా పరిణామాలు షాక్ ఇస్తున్నాయి. ఏసీల తయారీ (Manufacture AC)లో ఉపయోగించే ముడి సరుకుల ధరలు భారీగా పెరగడం, రూపాయి విలువ పడిపోవడంతో ఏసీల ధరలను 5 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఎండీ ముకుందన్ మేనన్ చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా ఏసీల తయారీలో అత్యంత కీలకమైన రాగి ధర అంతర్జాతీయ మార్కెట్లో (international market) టన్నుకు 13 వేల డాలర్లకు చేరడం ఉత్పత్తి వ్యయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనికి తోడు కొత్త ఎనర్జీ సేవింగ్ నిబంధనల వల్ల ఏసీల తయారీలో అదనపు మెటీరియల్ వాడాల్సి వస్తోందని, దీంతో ఒక యూనిట్ ధర గణనీయంగా పెరుగుతుందని వోల్టాస్ ఎండీ ముకుందన్ మేనన్ స్పష్టం చేశారు.

ధరలు పెరిగినప్పటికీ, ఈ ఏడాది ఏసీల అమ్మకాలు మాత్రం 15 నుంచి 20 శాతం మేర పెరుగుతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా మొదటిసారి ఏసీ కొనేవారి సంఖ్య పెరగడం, తీవ్రమైన ఎండల ప్రభావం వల్ల డిమాండ్ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 18 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్న వోల్టాస్, పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేలా తన ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటోంది. రాబోయే రెండేళ్లలో విడిభాగాల దిగుమతులను తగ్గించి, భారత్‌లోనే 90 శాతం మేర తయారీ (Localisation) చేపట్టాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story