- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసోం సీఎంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ అసదుద్దీన్ ఒవైసీ
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలనేదే తన కల అని చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలనేదే తన కల అని చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Chief Minister Himanta Biswa Sarma) స్పందించారు. ఈ దేశంలో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చని రాజ్యాంగపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన అంగీకరించారు. అయితే, భారతదేశం ఒక హిందూ దేశమని, ఇక్కడ ఉన్నది హిందూ నాగరికత అని హిమంత స్పష్టం చేశారు. అందుకే భవిష్యత్తులోనూ భారత ప్రధానమంత్రి ఎప్పుడూ ఒక హిందువుగానే ఉంటారని తాము బలంగా నమ్ముతున్నామని, ఈ విషయంలో తమకు పూర్తి విశ్వాసం ఉందని హిమంత తేల్చి చెప్పారు.
కాగా అసోం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (MP Asaduddin Owaisi) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజు ఆయన నాగ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హిమంత బిస్వా శర్మ బుర్రలో 'ట్యూబ్‌లైట్' ఉందంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవిని చేపట్టిన వ్యక్తి, అందులో ఎక్కడా లేని విషయాలను మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం ఏ ఒక్క వర్గానికో సొంతం కాదని, కానీ హిమంత మాత్రం రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా సంకుచిత మనస్తత్వం తో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
పాకిస్తాన్ రాజ్యాంగంలో మాత్రమే ప్రధాని లేదా అధ్యక్ష పదవులు ఒకే మతానికి చెందిన వారికి పరిమితమని, కానీ మన దేశ గొప్పతనం భిన్నమని ఒవైసీ గుర్తుచేశారు. హిమంత బిస్వా శర్మ కంటే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎంతో విజ్ఞానవంతుడని, ఆయన రాసిన రాజ్యాంగం దేవుడిని నమ్మని నాస్తికులకు కూడా సమాన హక్కులు కల్పిస్తుందని పేర్కొన్నారు. భారతదేశం ఏ ఒక్క మతానికో చెందినది కాదని, ఇటువంటి విషయాలు తెలియకే అసోం సీఎం చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.






