లడఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. తృటిలో తప్పిన ముప్పు

by Malleboina Mahesh |

లేహ్ సమీపంలో ఆర్మీ చీతా హెలికాప్టర్ క్రాష్ అయింది. మేజర్ జనరల్ సచిన్ మెహతాతో సహా ముగ్గురు అధికారులు అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు.

లడఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. తృటిలో తప్పిన ముప్పు
X

దిశ, వెబ్ డెస్క్: లడఖ్‌లోని లేహ్ సమీపంలో గల టాంగ్‌స్టే పర్వత ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన 'చీతా' హెలికాప్టర్ ('Cheetah' helicopter) అదుపుతప్పి కూలిపోయింది. అత్యంత ఎత్తైన, కఠినమైన మంచు పర్వతాల మధ్య నియంత్రణ కోల్పోయిన ఈ హెలికాప్టర్ క్రాష్ అయినప్పటికీ, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఉన్నతాధికారులు తృటిలో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో ఈ హెలికాప్టర్‌లో భారత సైన్యానికి చెందిన 3 ఇన్ఫాంట్రీ డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ సచిన్ మెహతా ప్రయాణిస్తుండగా, ఈ చాపర్‌ను లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ స్థాయి అత్యంత అనుభవజ్ఞులైన అధికారులు పైలటింగ్ చేస్తున్నారు. పర్వత శ్రేణులలో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం (Technical error) తలెత్తడం వల్ల హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి కూలిపోయినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో హెలికాప్టర్ (Helicopter) పూర్తిగా ధ్వంసమై ముక్కలైనప్పటికీ, అందులోని అధికారులందరికీ కేవలం స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ అధికారులు ఏమాత్రం అధైర్య పడకుండా, భయపడకుండా.. ధైర్యంగా కూలిపోయిన హెలికాప్టర్ శిథిలాల (Helicopter wreckage) మధ్యే కూర్చుని గ్రూప్ ఫోటోలు దిగారు. మరణానికి అత్యంత సమీపంగా వెళ్లి వచ్చినప్పటికీ, భారత సైనికులకుండే అచంచలమైన మనోధైర్యానికి (Morale) ఈ ఫోటోలు నిదర్శనంగా నిలిచాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని అధికారులను బేస్ క్యాంపునకు తరలించగా, ఈ ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారులు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు.

Next Story