ఏఆర్ రెహమాన్‌ బలవంతంగా క్షమాపణలు చెప్పారా? సంచలన నిజం బయటపెట్టిన వరుణ్

by Mallepaka Hamsa |

ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్(AR Rahman) గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు.

ఏఆర్ రెహమాన్‌ బలవంతంగా క్షమాపణలు చెప్పారా? సంచలన నిజం బయటపెట్టిన వరుణ్
X

దిశ, సినిమా: ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్(AR Rahman) గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే రెహమాన్, ఇటీవల బాలీవుడ్ పరిశ్రమపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన మతం కారణంగా హిందీ చిత్రసీమలో కొన్ని అవకాశాలు కోల్పోవాల్సి వచ్చిందని, తనపై ఒక వర్గం వివక్ష చూపిస్తోందనే అర్థం వచ్చేలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి, కొందరు ఆయనకు మద్దతు తెలపగా, మరికొందరు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ వివాదం ముదురుతుండటంతో రెహమాన్ వెంటనే స్పందిస్తూ.. ఒక వీడియోను విడుదల చేశారు. ‘‘భారతదేశం నా ప్రేరణ, నా ఇల్లు. సంగీతం ద్వారా అందరినీ ఏకం చేయడమే నా లక్ష్యం. నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు.

దీంతో ఈ గొడవ సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ, ప్రముఖ రచయిత వరుణ్(Varun) పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. రెహమాన్ తనంతట తానుగా క్షమాపణలు చెప్పలేదని, పరిస్థితులు ఆయనను ఆ స్థాయికి తీసుకొచ్చాయని వరుణ్ ఆరోపించారు. వరుణ్ తన పోస్ట్‌లో ‘లగాన్’ సినిమాలోని ‘ఓ పాలన్‌హారే’ పాటను షేర్ చేస్తూ ఘాటుగా స్పందించారు. ‘‘గత మూడు దశాబ్దాలుగా భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒక గొప్ప కళాకారుడు, తన వ్యక్తిగత అనుభవం గురించి నిజాయితీగా మాట్లాడితే.. ఆయనపై మూకుమ్మడి దాడి చేయడం సిగ్గుచేటు. కేవలం ఆ విషపూరిత మూకను శాంతింపజేయడానికి మరుసటి రోజే రెహమాన్‌ను బలవంతంగా క్షమాపణలు చెప్పేలా ఒత్తిడి తెచ్చారు. ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌కే ఈ పరిస్థితి ఎదురైందంటే, సమాజంలో విభజనవాదం ఏ స్థాయిలో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు’’ అని వరుణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఏఆర్ రెహమాన్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.

Next Story