కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

by Disha Web Desk |
కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్ నియామకం అయ్యారు. గురువారం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. వీరంతా రెండేళ్లపాటు పదవీలో కొనసాగనున్నారు.

మేడే రాజీవ్ సాగర్...

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన మేడే రాజీవ్ సాగర్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశారు. తెలంగాణ జాగృతి నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించారు. తెలంగాణ జాగృతిని గ్రామస్థాయి వరకు తీసుకెళ్ళి తెలంగాణవాదాన్ని వినిపించారు. 2006-2008 వరకు తెలంగాణ జాగృతి కోశాధికారిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014 నుంచి ఇప్పటివరకు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అనుబంధ క్రైస్తవ సామాజికవర్గ సేవా కార్యక్రమాలు చేపట్టారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని జనసమీకరణ చేపట్టారు. సకల జనుల సమ్మెలో సబ్బండ వర్గాలను సమీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మిలియన్ మార్చ్, సాగరహారం కార్యక్రమాలకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేలాదిమందిని సమీకరించి కార్యక్రమాలను ఫలవంతం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కంప్యూటర్ శిక్షణ, కంప్యూటర్ సెంటర్, జాబ్ మేళాలు, మెడికల్ క్యాంపులు, కళ్లద్దాల పంపిణీ చేశారు. నల్లమల అడవుల పరిరక్షణ, చెంచుల హక్కుల పరిరక్షణకు ఉద్యమించారు. తెలంగాణ ప్రాచీన చరిత్రను వెలికితీసేందుకు కృషి చేస్తున్నారు.

మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్

కామారెడ్డికి చెందిన మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్ 1968 జనవరి 30న జన్మించారు. బీఏ ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. న్యాయవాదిగా పనిచేస్తూ వ్యాపారం చేస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 1984-85లో కామారెడ్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా, 1995-2000, 2000-2005 రెండు పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్‌గా, 2013-2019లో నిజామాబాద్ డీసీఎంఎస్ చైర్మన్‌గా, 2004-2010 వరకు టీడీపీకి కామారెడ్డి టౌన్ ప్రెసిడెంట్‌గా, 2017-2022 టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

శ్రీదేవి మంత్రి

మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లా నారపల్లికి చెందిన మంత్రి శ్రీదేవి, తండ్రి మంత్రి శశిభూషన్ రావు. 1971 జనవరి 2న జన్మించిన ఈమె.. బీఎస్సీ చదివారు. టీఆర్ఎస్ పార్టీలో 2004లో చేరారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.


Next Story

Most Viewed