జీహెచ్ఎంసీ-1955 చట్టానికి సవరణ

by Malleboina Mahesh |

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌ కోసం సర్కార్ ‘క్యూర్ యాక్ట్’ తెస్తోంది. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల పాలనను సమన్వయం చేస్తూ హైడ్రాకు కీలక అధికారాలివ్వనుంది.

జీహెచ్ఎంసీ-1955 చట్టానికి సవరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)పై ఫోకస్ పెట్టింది. మున్సిపల్ శాఖను హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలపల్‌మెంట్ (ఔటర్ రింగ్ రోడ్డు లోపల), మున్సిపల్ అడ్మినిస్ట్రేటన్ డిపార్ట్ మెంట్ (ఓఆర్ఆర్ వెలుపల) విభజించిన సర్కార్ అర్బన్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. దీని పరిధిలో ఉన్న టీసీయూఆర్‌కు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే కోర్ అర్బన్ రీజియన్‌లో జీహెచ్ఎంసీ చట్టాన్ని అమలు చేస్తున్నారు. దీని స్థానంలో కొత్తగా ‘క్యూర్ యాక్ట్’ తీసుకురావడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు.

మూడు మున్సిపల్ కార్పొరేషన్లు

650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలను విలీనం చేయడంతోపాటు 300 వార్డులుగా విభజించారు. తర్వాత దీన్ని 150 వార్డులతో కొత్తగా జీహెచ్ఎంసీ, 76 వార్డులతో సీఎంసీ, 74 వార్డులతో ఎంఎంసీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పునర్విభజన సమయంలో జీహెచ్ఎంసీ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కానీ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో జీహెచ్ఎంసీ చట్టాన్ని ఎలా అమలు చేస్తారనే చర్చ జరుగుతున్నది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లు వేర్వేరుగా ఉన్నప్పుడు చట్టాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్‌లకు వర్తించే విధంగా ‘క్యూర్’ చట్టాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.

‘క్యూర్ యాక్టు’లో..

కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మూడు మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు హైడ్రా, కొత్త డిస్కం, హెచ్ఎండీఏ, జలమండలి, మూడు పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. వీటితోపాటు కోర్ అర్బన్ రీజియన్ ఆధారంగానే రెవెన్యూ జిల్లాల్లో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే కోర్ అర్బన్ రీజియన్‌లో విపత్తుల నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా వంటి అంశాలను సైతం క్యూర్ చట్టంలో చేర్చనున్నట్టు అధికారులు చెబుతున్నారు. హైడ్రా ఏర్పాటు సమయంలో తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ చట్టం 1955, 374బీ సెక్షన్ ద్వారా విస్తృతమైన చట్టబద్ధమైన అధికారాలను కల్పించింది.

చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల గుర్తింపు నోటీసుల జారీ, అక్రమ కట్టడాల కూల్చివేత, సీజ్ చేసే అధికారాలు ఈ సంస్థకు ఉన్నాయి. దీంతోపాటు మున్సిపల్ చట్టం-2019, హెచ్ఎండీఏ చట్టం 2008 కింద మున్సిపల్ కమిషనర్లకు ఉండే అధికారాలను హైడ్రా కమిషనర్‌కు కల్పించారు. వీటితోపాటు జీహెచ్ఎంసీ నుంచి జలమండలికి రావాల్సిన బకాయిలు, జీహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండీఏకు డెవలప్‌మెంట్ చార్జీల రూపంలో రావాల్సిన బకాయిల విషయంలో వివాదాలు ఉన్నాయి. దీంతోపాటు ప్లానింగ్, డెవలప్‌మెంట్ విభాగంలో అధికారాల బదలాయింపు సమస్యలు సైతం ఉన్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టే విధంగా ‘క్యూర్ చట్టం’లో మార్పులు తీసుకురానున్నారు.

రాష్ట్రంలో రెండు చట్టాలు

రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలతో కలిపి 133 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)లకు ‘క్యూర్ చట్టం’ తీసుకురానున్నారు. మిగిలిన 9 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు 2019 చట్టం ఉన్నది. దీంతో రాష్ట్రంలో రెండు మున్సిపల్, పట్టణాభివృద్ధి చట్టాలు అమలుకానున్నాయని అధికారులు చెబుతున్నారు.

Next Story