వరల్డ్ టాప్ 2 లో ఎయిర్‌టెల్

by Muthe.Rajitha |

ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డును సృష్టించింది.

వరల్డ్ టాప్ 2 లో ఎయిర్‌టెల్
X

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశానికి చెందిన ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 65 కోట్లకు పైగా చందాదార్లను (Subscribers) కలిగి ఉండటం ద్వారా, చైనా మొబైల్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం సేవల సంస్థగా ఎయిర్‌టెల్ అవతరించింది. జీఎస్‌ఎంఏ (GSMA) ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. వినియోగదారుల సంఖ్య పరంగా ఎయిర్‌టెల్ ఈ ఘనతను సాధించినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. భారత్‌తో పాటు ఆఫ్రికాలోని 14 దేశాలలో విస్తరించిన ఎయిర్‌టెల్ నెట్‌వర్క్, తన వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటూ అంతర్జాతీయ వేదికపై పటిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది.

మార్చి 31 నాటి గణాంకాలను పరిశీలిస్తే... కేవలం భారతదేశంలోనే ఎయిర్‌టెల్‌కు 46.4 కోట్ల మంది చందాదార్లు ఉన్నారు. ఇందులో 36.9 కోట్ల మొబైల్ వినియోగదారులు కాగా, మిగిలిన వారు బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ టీవీ మరియు ఐఓటీ (IoT) సేవలను వాడుతున్నారు. ఇక ఆఫ్రికా ఖండంలోని 14 దేశాల్లో కలిపి దాదాపు 17.9 కోట్ల మంది వినియోగదారులు ఎయిర్‌టెల్ సేవలను వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది చందాదార్లతో 'చైనా మొబైల్' మొదటి స్థానంలో కొనసాగుతుండగా, ఎయిర్‌టెల్ రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. టెలికాం రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులు, విస్తరణ వేగం దృష్ట్యా, రాబోయే రోజుల్లో ఎయిర్‌టెల్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే అవకాశం ఉంది.

Next Story