- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీసీసీ చీఫ్‌ల ప్రోగ్రెస్ రిపోర్ట్
జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల పనితీరుపై ఏఐసీసీ దృష్టి పెట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల పనితీరుపై ఏఐసీసీ దృష్టి పెట్టింది. అధ్యక్షులుగా నియమితులైన తరువాత వికారాబాద్‌లో శిక్షణ అనంతరం వారి పనితీరును సమీక్షించనున్నారు. ఈ మేరకు ఎంపీ సింథల్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నేడు, రేపు డీసీసీ అధ్యక్షుల పనితీరును సమీక్షిస్తారు. తమ పనితీరును చెప్పుకోవడానికి, నివేదికను అందించడానికి ఒక్కొక్కరికి 20 నిమిషాల సమయాన్ని కేటాయించారు. డీసీసీ అధ్యక్షులకు ఇప్పటికే ఏ రోజున, ఎన్ని గంటలకు వారికి సమయం కేటాయించింది? అనే సమాచారం అందించారు. డీసీసీ అధ్యక్షులు నివేదిక తయారీపై గత రెండు, మూడు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. పనితీరు వివరించడంతోపాటుగా తమ జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకుల సహకారం ఎంతవరకు ఉంది?.. ఎలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఏ విధంగా ఉంది?.. తదితర వివరాలను సమీక్షలో అడగనున్నట్లుగా సమాచారం.
ఫొటోలతో సహా వివరాలు..
డీసీసీ అధ్యక్షుల పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రియాంకగాంధీ నేతృత్వంలో బృందం ఏఐసీసీ కార్యాలయంలో నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నది. పీసీసీ కార్యాలయం, ఏఐసీసీ కార్యాలయంలో కనెక్ట్సెంటర్ను ఏర్పాటు చేశారు. డీసీసీల కార్యక్రమాలను పార్టీ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్చేయాల్సి ఉంటుంది. డీసీసీ అధ్యక్షులు సమావేశాలు, సమీక్షలు ఏర్పాటు చేసుకున్న దగ్గరి నుంచే ఫొటోలను అప్లోడ్చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో ఉండి జిల్లాకేంద్రంలో కార్యక్రమం చేశామని ఫొటోలు పెడితే జియో ట్యాగింగ్‌తో వివరాలన్నీ తెలిసిపోయే విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఏఐసీసీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఎన్నింటిని అమలు చేశారు?.. పీసీసీ ఇచ్చిన కార్యక్రమాలను ఎన్నింటిని అమలు చేశారు?.. తదితర వివరాలపై నివేదిక ఇవ్వాలని సూచించారు.
పనితీరు ఆధారంగా రేటింగ్..
సోషల్ మీడియాలో ఎంతవరకు యాక్టివ్‌గా ఉన్నారు?.. మీ కార్యక్రమాల పోస్టులు పెట్టడమే కాకుండా, పార్టీ జాతీయ నాయకుల అకౌంట్లు ఫాలో అవుతున్నారా లేదా..? ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రమోట్చేస్తున్నారా? తదితర వివరాలన్నింటినీ అడిగారు. డీసీసీ అధ్యక్షుడిగా నియమితులు అయ్యాక జిల్లాల్లోని ఎన్ని గ్రామాల్లో పర్యటించారు?.. ఏ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు?.. పార్టీ కమిటీలు ఎన్నింటిని నియమించారు... తదితర వివరాలను తీసుకురావాల్సిందిగా సూచించారు. డీసీసీ అధ్యక్షులకు వారి పనితీరు ఆధారంగా రేటింగ్కూడా ఇచ్చారు.
ఎంపీలతో కీలక సమావేశం..
మరోవైపు పార్టీ లోక్‌సభ ఎంపీలతో ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్వరుస సమీక్షలు నిర్వహించారు. మంగళవారం రాష్ట్రానికి వచ్చిన ఆమె ‘సర్’పై ప్రత్యేక దృష్టి పెట్టారు. గడువు సమీపిస్తున్నందున ఎంతవరకు ఫారాలను సమర్పించారు?.. పార్టీ కేడర్, ఇన్‌చార్జులు ఏవిధంగా పాల్గొంటున్నారనే విషయాలపై ఆమె సమీక్షించారు. పలువురు ఎంపీలు సర్ప్రక్రియలో పార్టీ కేడర్ ఉత్సాహంగా పాల్గొంటున్నారని, తమ పనుల సైతం పక్కకు పెట్టి దీనిలో నిమగ్నమయ్యారని తెలిపారు. స్టేషనరీ ఖర్చులు, ఇతర కనీస ఖర్చుల కోసం పార్టీ కొంత మొత్తం సమకూరిస్తే బాగుంటుందని పలువురు ఎంపీలు సూచించినట్లుగా సమాచారం. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తున్నాయని, ఇంకా వెళ్లాలంటే ఏం చేయాలనే విషయాలపై మీనాక్షి ఎంపీల అభిప్రాయాలను తెలుసుకున్నట్లుగా సమాచారం.






