AI డేటా సెంటర్లతో భూమికి కొత్త ముప్పు.. అమెరికాలో వెల్లువెత్తుతున్న నిరసనలు

by Muthe.Rajitha |

AI డేటా సెంటర్ల ఏర్పాటుకు అంతర్జాతీయ కంపెనీలు భారత్ క్యూ కట్టడం వెనుక రహస్యం ఇదేనా? హైదరాబాద్, వైజాగ్ నగరాలు కరువుదిబ్బలుగా మారనున్నాయా?

AI డేటా సెంటర్లతో భూమికి కొత్త ముప్పు.. అమెరికాలో వెల్లువెత్తుతున్న నిరసనలు
X

దిశ, వెబ్ డెస్క్ : గత ఐదేళ్ళలో భారత దేశంలో AI డేటా సెంటర్ల స్థాపన వేగంగా పెరిగింది. ముఖ్యంగా 2023లో వచ్చిన Chat gpt బూమ్ తర్వాత AI డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు భారత్ కు క్యూ కట్టాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు విప్లవం(AI Revolution) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, దాని వెనుక ఉన్న మౌలిక సదుపాయాల ప్రభావంపై కూడా కొత్త చర్చ ప్రారంభమైంది. సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటా వంటి టెక్నాలజీ కంపెనీలు నిర్మిస్తున్న భారీ డేటా సెంటర్లు ఇప్పుడు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలు డేటా సెంటర్ల దుష్ప్రభావం మనవాళిపై, ప్రకృతిపై ఎంత ఉంటుంది అనే అంశాలు ప్రపంచ దృష్టికి తీసుకువస్తున్నాయి. అమెరికాలో ఒక డేటా సెంటర్ సమీపంలో నివసిస్తున్న ప్రజలు నిరంతర శబ్ద కాలుష్యం, కంపనలు, విద్యుత్ వినియోగ ఒత్తిడి, నీటి సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నట్లు బాధితులు చెబుతున్నారు.

ముప్పేమిటీ?

డేటా సెంటర్లు అనేవి ఆధునిక డిజిటల్ ప్రపంచానికి గుండెకాయ లాంటివి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, AI మోడల్స్, క్లౌడ్ సేవలు.. ఇవన్నీ నిరంతరం పనిచేయడానికి లక్షల సంఖ్యలో సర్వర్లు 24 గంటలు నడవాల్సి ఉంటుంది. ఇందుకోసం భారీ స్థాయిలో విద్యుత్, నీరు, భూమి వినియోగం జరుగుతోంది. ప్రత్యేక AI టెక్నాలజీ అభివృద్ధితో డేటా సెంటర్లు ఆపరేట్ అవుతాయి. అధునాతన AI మోడళ్లను ట్రైన్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి విపరీతమైన కంప్యూటింగ్ శక్తి అవసరం అవుతోంది. ఈ ప్రక్రియలో సర్వర్లు అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయడం వల్ల వాటిని చల్లబరచడానికి భారీగా నీటిని వినియోగిస్తున్నారు. దీంతో స్థానిక నీటి వనరులను భారీ స్థాయిలో డేటా సెంటర్లకు మళ్లించడం జరుగుతోంది. దీనివల్ల నీటి వనరులపై తీవ్ర ఒత్తిడి పెరుగడమే కాకుండా, భూమి అతిపెద్ద నీటి కరువును ఎదుర్కోబోతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తీవ్ర ఆందోళనలు.. కంపెనీల యూటర్న్

ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు. సామాజిక న్యాయ పరమైన అంశంగా కూడా మారుతోంది. టెక్నాలజీ సౌకర్యాలను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగిస్తున్నప్పటికీ, వాటి భారం మాత్రం కొద్దిమంది స్థానిక ప్రజలపై పడుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల అమెరికాలో పలుచోట్ల AI డేటా సెంటర్లను నెలకొల్పడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరగగా.. కొన్ని కంపెనీలు డేటా సెంటర్ల ఏర్పాటును విరమించుకున్నాయి.

ప్రత్యామ్నాయాలు

ఈ పరిస్థితుల నేపథ్యంలో టెక్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ప్రారంభించాయి. ఎడారి ప్రాంతాలు, సముద్ర గర్భ ప్రాంతాలు, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో డేటా సెంటర్ల నిర్మాణంపై పరిశోధనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో అంతరిక్ష ఆధారిత డేటా సెంటర్ల ఆలోచనలు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయినప్పటికీ, టెక్నాలజీ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత ఎలా సాధించాలనే విషయంపై పరిశోధనలు సాగుతున్నాయి.

ఈజీ టార్గెట్ భారత్.. ఎందుకంటే?

అయితే ఇక్కడే బీద దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. AI డేటా సెంటర్ల వలన కలగబోయే భారీ విపత్తులపై యూరప్, అమెరికా దేశాల్లో ఆందోళనలు ఉదృతం అవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోవడంలో భాగంగా.. ఆ ప్రత్యామ్నాయం పేద దేశాలు లేదా టెక్ రంగంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచే భారత్ వంటి దేశాలు కాబోతున్నాయా అనే సందేహం కలుగుతోంది. అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలతోపాటు, పెద్ద మొత్తంలో సహజ వనరులున్న ఆఫ్రికా, సౌత్ అమెరికా వంటి దేశాలు ఇప్పుడు AI డేటా సెంటర్ల ఏర్పాటుకు టార్గెట్ కాబోతున్నాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల భారత్ లో వివిధ కంపెనీలు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా AI డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. గత మూడేళ్ళలో భారత్ లో అనౌన్స్ చేసిన డేటా సెంటర్ల దాదాపు 30 వరకు ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనిని బట్టి అంతర్జాతీయ టాప్ కంపెనీలు ఏ ఉద్దేశంతో భారత్ లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పైకి మానవ నైపుణ్యాలు అని చెబుతున్నప్పటికీ.. డేటా సెంటర్ల నిర్వహణకు అవసరం అయ్యే ఇంధన వనరులు, నీటి వాడకం ఇక్కడ చవకగా లభిస్తుంది.

కరువు దిబ్బలుగా నగరాలు

అంతేకాదు ఇక్కడి ప్రభుత్వాలు భవిష్యత్తులో రాబోయే దుష్ఫలితాల కంటే.. ఆయా కంపెనీల పేరును కూడా ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికో, లేక ఇతరత్రా క్విడ్ ప్రో కో వంటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం వారికి కలిసి వచ్చే అంశం. భవిష్యత్తులో ప్రజలు వీటి ఏర్పాటును అడ్డుకోడానికి ప్రయత్నించినా ప్రభుత్వాలే దగ్గరుండి ఆ నిరసనలను అణచివేసి, వారికి అండగా నిలుస్తాయని ధీమా కూడా ఆయా కంపెనీలకు బలంగా ఉంది. కాబట్టి భారత్ లో డేటా సెంటర్ల హాబ్స్ గా మారనున్న ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు తీవ్రస్థాయిలో నీటి కరువును, విద్యుత్ కరువును ఎదుర్కోబోతున్నాయి అని తెలుస్తోంది. AI డేటా సెంటర్ల కంపెనీలు ఎంత త్వరగా ప్రత్నామ్నాయ మార్గంగా ఎకో AI మోడళ్లను కనుక్కుంటే.. వాటితో నడిచే డేటా సెంటర్ల వల్ల మానవాళి, భూమి పెద్ద ముప్పు నుంచి బయటపడతాయని టెక్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story