అకాడమిక్ స్వయం ప్రతిపత్తి అంటే జాతీయ సార్వభౌమాధికారం

by Disha Web Desk 12 |
అకాడమిక్ స్వయం ప్రతిపత్తి అంటే జాతీయ సార్వభౌమాధికారం
X

దిశ, కేయూ క్యాంపస్: కాకతీయ విశ్వవిద్యాలయంలో పి.వి నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ఆదివారం నాడు కేయూ సెనేట్ హాల్లో ప్రారంభమైంది. ఈ సదస్సుకు రాజ్య సభ సభ్యులు, పి.వి.నరసింహారావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కే. కేశవరావు ముఖ్య అతిథిగా హాజరైనారు. కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ అధ్యక్షతన విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగం, పివి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఆపర్చునిటీస్, చాలెంజ్స్ అండ్ సొల్యూషన్స్ అనే అంశంపై జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ప్రపంచంలో విద్యను అభ్యసించే దేశాల్లో మూడో స్థానాన్ని ఆక్రమించిన భారతదేశంలో కేవలం మూడవ వంతుకు మాత్రమే విద్య అందుబాటులో ఉందన్నారు. విద్య అంటే కేవలం చదువు మాత్రమే కాదని నూతన జాతీయ విద్యావిధానం సామాజిక న్యాయం పై దృష్టి పెట్టాలన్నారు. తరగతి గదిలోనే జాతి నిర్మాణం జరుగుతుందిని మన పెద్దలు ఎప్పుడో తెలియచేసారని గుర్తుచేశారు. దేశంలో 75 శాతం ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. అవి కేవలం మార్కెట్ కు అనుగుణంగా బోధనా సాగిస్తున్నాయన్నారు. ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పెరగటం అభినందనీయమని పేర్కొన్నారు. 2030 వరకు 40 శాతం ఉన్నత విద్యకు దగ్గర అవుతారని, మన ఆలోచనా సరళి మారాలని తెలిపారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయు పివి విజ్ఞాన కేంద్రానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్య జి.హరగోపాల్ మాట్లాడుతూ.. సమాజ ఆరోగ్యం యూనివర్సిటీ ఆరోగ్యంపై ఆధారపడి ఉందన్నారు. విశ్వవిద్యాలయాలు తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. విశ్వవిద్యాలయాల నుంచి మంచి మానవీయ విలువలు ఉన్న మేధావులు తయారు కావాలని, విద్య సామాజిక అవసరాలు తీర్చేల ఉండాలి తప్ప మానవ కోరికలకు కాదని పేర్కొన్నారు. విద్య కేవలం మార్కెట్ అవసరాలను తీర్చటం బాధాకరం అన్నారు. విద్య ప్రైవేటు కావడం దురదృష్ట కరమని, 200కు పైగా విదేశీ విశ్వవిద్యాలయాలు భారతదేశంలోకి ప్రవేశించాయని అన్నారు.


అవి డబ్ల్యూటీఓ, ప్రపంచీకరణలో భాగమన్నారు. విద్య కేంద్రీకృతం కావటం బాధాకరమని, జాతీయ విద్యా విధానం పై మరింత చర్చ జరగాల్సి ఉందన్నారు. నూతన సాంకేతికతో ఉన్నత విద్యలో మరిన్ని మార్పులకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు, అనంతరం జరిగిన రెండు సెషన్‌లలో పరిశోధకులు తమ పత్రాలను సమర్పించారు. ఆన్‌లైన్ లో కుడా 150 మంది పాల్గొని తమ పత్రాలను సమర్పించడం జరిగింది. సోమవారం ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి పాల్గొంటారని, విశిష్ట అతిథిగా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య ఎన్ లింగమూర్తి, ఇతర అతిథులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

Next Story

Most Viewed