బాలింత మృతి.. వైద్యుల నిర్లక్ష్యమేనా..?

by Disha Web Desk 13 |
బాలింత మృతి.. వైద్యుల నిర్లక్ష్యమేనా..?
X

దిశ, కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత మృతి చెందింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కల్వకుర్తి పట్టణం సుభాష్ నగర్ కు చెందిన కనక మౌనిక(28)కు నెలలు నిండడంతో మూడో కాన్పు నిమిత్తం ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది.


అనంతరం నార్మల్ డెలివరీ కావడంతో మౌనిక పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అదే క్రమంలో బాధితురాలి ఆరోగ్య పరిస్థితి బాగాలేక తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో ఆస్పత్రి వైద్యులు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫెర్ చేశారు. బాధితురాలి బంధువులు వెంటనే పాలమూర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

మృతురాలి మృతదేహాన్ని తీసుకుని తిరుగు ప్రయాణమై బంధువులు కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొన్నారు. అనంతరం సోమవారం తెల్లవారుజామున అధిక రక్తస్రావంతో మౌనిక మృతి చెందిందని, వైద్యురాలు పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తూ.. మౌనిక కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారిపై 2 గంటల పాటు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ నిరసన ద్వారా ట్రాఫిక్ జాం కావడంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి.


వైద్యం నిర్లక్ష్యం చేసి ప్రాణం పోయేటట్టు చేసిన వైద్యులను సస్పెండ్ చేసి వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి ఇంచార్జ్ శివరాం అక్కడికి చేరుకొని మృతురాలు మృతి చెందడానికి గల కారణాలు చెప్పడంతో విషయం సద్దుమణిగి ధర్నా విరమించారు. అనంతరం ఆస్పత్రి సిబ్బంది పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు.

కంటతడి పెట్టించిన బంధువుల రోదనలు..


మృతి చెందిన మౌనికకు ముగ్గురు చిన్నారులు. పక్కన ఒక రోజు చంటిబిడ్డ.. మరో ఇద్దరు బిడ్డలు 6 సంవత్సరాల లోపు వాళ్ళే.. వారిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. మొన్నటిదాకా ఉన్నంతలో ఏదో తిని రోజులు గడిపేవారు. భర్త మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో కుటుంబాన్ని మృతురాలే కూలీ, నాలీ చేసుకుంటూ జీవితం వెల్లదీస్తుంది. నేడు వారి జీవితాల్లో పెను విషాదం నింపింది. కాలం కాలనాగై కాటువేసి నలుగురిని అనాథలను చేసింది.

అనాథలకు ప్రభుత్వమే అండగా ఉండాలి..

అనాథలైన పిల్లల సంరక్షణతో పాటు చదువులకు సంబంధించి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. ఆ పిల్లలకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా పూర్తి చేయూతనందించాలి. వీరిని చదివించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలి. పిల్లల పోషణ భారం కావడంతో ఆదుకోవాలని అధికారులను పలువురు స్థానికులు కోరుకుంటున్నారు. అనాథలైన పిల్లలకు ప్రభుత్వమే అండగా నిలవాలి.


Next Story

Most Viewed