భయంకర వ్యసనం వెలుగులోకి.. మత్తు కోసం సొంత రక్తాన్ని ఎక్కించుకుంటున్న యువత

by Malleboina Mahesh |   (  Updated:2026-04-14 08:59:10  IST  )

భోపాల్‌లో ‘బ్లడ్ కిక్’ వ్యసనం కలకలం! మత్తు కోసం రక్తాన్ని తీసి మళ్లీ ఎక్కించుకుంటున్న యువత. ఇన్ఫెక్షన్లు, సెప్సిస్ వచ్చే ప్రమాదం.

భయంకర వ్యసనం వెలుగులోకి.. మత్తు కోసం సొంత రక్తాన్ని ఎక్కించుకుంటున్న యువత
X

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటికే మద్యం, గంజాయి, డ్రగ్స్, ఇతర కెమికల్స్ తో వల్ల యువత వ్యసనానికి గురవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో భయంకర వ్యసనం వెలుగులోకి వచ్చింది. మత్తుకు బానిసలైన యువకులు మత్తుకోసం తమ రక్తాన్ని బయటకు తీసి తిరిగి ఎక్కించుకుంటున్నారు. దీనినే బ్లడ్ కిక్ అంటారు. ఇది అత్యంత భయంకర వ్యసనం వైద్య నిపుణులు తెలిపారు. ఈ దారుణమైన వ్యసనం.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వెలుగులోకి వచ్చింది. అక్కడి యువత అత్యంత ప్రమాదకరమైన ఈ మత్తు వ్యసనం బారిన పడుతున్నారు.

సాధారణ డ్రగ్స్‌కు భిన్నంగా, వీరు ‘బ్లడ్ కిక్’ (Blood Kick) అనే వికృత పద్ధతికి అలవాటు పడుతుండటం కలకలం రేపుతోంది. ఈ విధానంలో యువకులు తమ శరీరం నుండి సిరంజి ద్వారా రక్తాన్ని బయటకు తీసి, కొద్దిసేపటి తర్వాత తిరిగి అదే రక్తాన్ని తమ శరీరంలోకి ఎక్కించు కుంటున్నారు (Self-blood transfusion). ఇలా చేయడం వల్ల మెదడుకు ఒక రకమైన మొద్దుబారిన అనుభూతి కలిగి, క్షణిక కాలం పాటు ‘కిక్’ వస్తుందని వారు నమ్ముతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి భోపాల్‌లో ఇలాంటి ఐదు కేసులు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది.

ఈ ‘బ్లడ్ కిక్’ వ్యసనం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అపరిశుభ్రమైన సిరంజిలు ఉపయోగించడం వల్ల రక్తం విషతుల్యం కావడం (Sepsis), కాలేయ సంబంధిత వ్యాధులు (Hepatitis), ఒకవేళ సిరంజిలను ఇతరులతో పంచుకుంటే హెచ్ఐవి (HIV) వంటి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, పదేపదే ఇలా చేయడం వల్ల నరాలు శాశ్వతంగా దెబ్బతినడం, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం (Blood Clots) వంటి సమస్యలు తలెత్తి, అవి గుండెపోటు, పక్షవాతానికి దారితీస్తాయని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఇది శారీరక ఆరోగ్యాన్నే కాకుండా, మానసిక స్థితిని కూడా చిన్నాభిన్నం చేస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వింత వ్యసనాలకు బానిసైన వారిలో తీవ్రమైన డిప్రెషన్, ఏకాంతంగా గడపడం, తమను తాము గాయపర్చుకునే (Self-harm) లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే మార్పులను నిశితంగా గమనించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చేతులు, కాళ్లపై పదేపదే కనిపిస్తున్న సూది గుర్తులు, అనవసరమైన ఆందోళన వంటి సంకేతాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మానసిక వైజ్ఞానిక నిపుణులను, వైద్యులను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి వ్యసనాల పట్ల యువతలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

Next Story