ట్రంప్ పై మూడో అటాక్.. ఇరాన్ హస్తం ఉందా?

by Muthe.Rajitha |

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్ హౌస్ సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపింది.

ట్రంప్ పై మూడో అటాక్.. ఇరాన్ హస్తం ఉందా?
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్ హౌస్ సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపింది. ఒక దుండగుడు వైట్ హౌస్ రక్షణ వలయంలోని 17th స్ట్రీట్, పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద గల సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్ లక్ష్యంగా ఈ దాడులకు తెగబడ్డాడు. తన బ్యాగ్ నుంచి ఒక్కసారిగా ఆయుధాన్ని బయటకు తీసి అక్కడ విధుల్లో ఉన్న సీక్రెట్ సర్వీస్ అధికారులపై కాల్పులు జరపడంతో, భద్రతా బలగాలు తక్షణమే అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సదరు నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అధికారులు ఈ నిందితుడిని 21 ఏళ్ల నాసిర్ బెస్ట్‌గా గుర్తించారు. గతంలో 2025లో కూడా ఈయన వైట్ హౌస్ పరిసరాల్లోకి అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించి అరెస్టయ్యాడని, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కాల్పుల సమయంలో ఒక సాధారణ పౌరుడు కూడా గాయపడగా, ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధం లోపలే ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

అయితే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని గడిచిన కొన్ని నెలల్లో వరుసగా భద్రతా ఉల్లంఘనలు, దాడులు జరగడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ 25న వాషింగ్టన్ హిల్‌టన్ హోటల్‌లో జరిగిన వార్షిక 'వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్' వేడుకల సందర్భంగా కోల్ టోమస్ అలెన్ అనే వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని లోపలికి దూసుకువచ్చి కాల్పులు జరపడం అప్పట్లో అగ్రరాజ్యాన్ని కుదిపేసింది. ఆ సమయంలో డోనాల్డ్ ట్రంప్, ఇతర ఉన్నతాధికారులు వేదికపైనే ఉండటంతో భద్రతా బలగాలు ట్రంప్‌ను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ఈ ఘోర ఉదంతం జరిగి కనీసం నెల రోజులు కూడా గడవక ముందే, మళ్లీ శనివారం సాయంత్రం నేరుగా వైట్ హౌస్ చెక్‌పాయింట్ వద్దే తుపాకీ శబ్దాలు వినిపించడం అమెరికా అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లపై పెను సవాలుగా నిలిచింది. అంతేకాదు ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ నివాసంలోకి ఆ అజ్ఞాతవ్యక్తి చొరబడటానికి ప్రయత్నించగా.. భద్రతా బలగాలు హతం చేసాయి. అయితే ఆ ఆసమయంలో ట్రంప్ వైట్ హౌస్ లో లేరు.

ఈ వరుస దాడుల వెనుక ఏదైనా అంతర్జాతీయ కుట్ర కోణం ఉందా అనే కోణంలో అమెరికా గూఢచార సంస్థ ఎఫ్‌బీఐ (FBI), ఇతర భద్రతా విభాగాలు లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి. ముఖ్యంగా ఇటీవల ఇరాన్ పార్లమెంటులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను లక్ష్యంగా చేసుకుని 50 మిలియన్ యూరోలు (సుమారు 58 మిలియన్ డాలర్ల) భారీ బౌంటీ (రివార్డు) ప్రకటించేలా ఒక ప్రత్యేక బిల్లుపై చర్చలు నడుస్తున్నట్లు అంతర్జాతీయంగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడిపై జరిగిన ఈ వరుస హత్యాప్రయత్నాలు వెనుక ఇరాన్ ప్రమేయం గాని విదేశీ శక్తుల ప్రోద్బలం గాని ఏమైనా ఉందా అనే కోణాన్ని నిఘా వర్గాలు కొట్టిపారేయడం లేదు. ఈ నేపథ్యంలోనే వైట్ హౌస్ భద్రతను మునుపెన్నడూ లేనంతగా కట్టుదిట్టం చేస్తూ విచారణను వేగవంతం చేశారు.

Next Story