‘స్టాంప్ డ్యూటీ స్కాం’లో కొత్త కోణం..! ఆన్‌లైన్‌ ఫ్రీ వెర్షన్లతో పీడీఎఫ్ చలానా మార్ఫింగ్

by Kema Shiva Kumar |

టెక్నాలజీ యుగంలో ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేయడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది.

‘స్టాంప్ డ్యూటీ స్కాం’లో కొత్త కోణం..! ఆన్‌లైన్‌ ఫ్రీ వెర్షన్లతో పీడీఎఫ్ చలానా మార్ఫింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టెక్నాలజీ యుగంలో ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేయడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. సినీ ప్రముఖులు, చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారే తమ ఫొటోల దుర్వినియోగంపై కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే సాంకేతికతను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ ఖజానాకే కన్నం వేయొచ్చని నిరూపిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఆన్ లైన్ ఫ్రీ వెర్షన్ల ద్వారా పీడీఎఫ్ ఫైళ్లను ట్యాపరింగ్ చేస్తూ.. చలానాను మార్ఫింగ్ చేస్తూ స్టాంప్ డ్యూటీ స్కాంకు తెరతీశారు. ఆన్ లైన్ ఎడిట్ ఆప్షన్ల ద్వారా రూ.500 చలానాను రూ.5 లక్షలుగా మార్చేసి.. భూ భారతి, ధరణి పోర్టళ్లనే ఏమార్చి.. భూ క్రయ విక్రయాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కొనుగోలు దారుల నుంచి పూర్తి డబ్బులు వసూలు చేసి, తక్కువ మొత్తానికి చలానా కట్టి దోపిడీకి పాల్పడ్డారు. అయితే కొన్ని సేల్ డీడ్స్ కొనుగోలుదార్లకు తెలిసే జరిగి ఉండొచ్చు. కొందరు ఆపరేటర్లు కక్కుర్తిపడి ఈ పనిచేసి ఉండొచ్చు. దీనిపై రెవెన్యూ శాఖ దర్యాప్తు కొనసాగిస్తున్నది. పోలీసు శాఖ కూడా లెక్కలు తేల్చే పనిలో పడింది. తెర వెనుక టెక్నాలజీ హెడ్స్ లేకుండానే పని జరిగిందా.. లేదా? అన్నది ప్రభుత్వ విచారణలోనే బయటపడాలి. కాగా, మరోసారి అక్రమార్కులకు అవకాశం లేకుండా మెరుగైన, పకడ్బందీ వెబ్ పోర్టల్ ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. భూ భారతి 2.0‌లో అక్రమార్కులకు అవకాశం లేని టెక్నాలజీని వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

హన్మకొండలోనూ అక్రమార్కులు

హన్మకొండ జిల్లా నడికుడ మండలానికి చెందిన ఓ కుటుంబం తమ తండ్రి పేరిట ఉన్న భూమిని వారసుల పేరిట సక్సెషన్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నది. పరిచయమున్న మీ సేవా కేంద్రం నిర్వాహకుడు నాగేంద్రప్రసాద్ ని సంప్రదించారు. అతను వివరాలన్నీ తీసుకొని రూ.50 వేల వరకు అవుతుందంటే డబ్బులు ఇచ్చారు. ఈ మేరకు అమౌంట్ కట్టినట్లుగా చూపించాడు. అయితే నెలలు గడుస్తున్నా పని కాలేదు. నిజానికి అతను వారసులకు ఇచ్చిన చలానా ఉత్తుత్తిదే. చలానా నం.6170295738029 ద్వారా రూ.41,880 చెల్లించినట్లుగా పీడీఎఫ్ ఫైల్ ఉంది. 2023 డిసెంబరు 19న రూపొందింది. మర్చంట్ పేరు దగ్గర ధరణి ప్రాజెక్టు కమిషనర్ అండ్ ఐజీఆర్ఎస్ తెలంగాణ అని పేర్కొన్నారు. ఇది అచ్చు గుద్దినట్లుగా ఎస్బీఐ చలానా మాదిరిగానే ఉంది. నిజానికి ఇది ప్రభుత్వ ఖాతాలో జమ కాలేదు. అంటే ఇది పక్కా ఫేక్ అని తెలుస్తుంది. నిజానికి అతను సక్సెషన్ కి అప్లయ్ కూడా చేయలేదు. విషయం తెలుసుకున్న బాధితులు మరోసారి వేరే చోట చలానా కట్టి అప్లయ్ చేయగా.. ఎలాగోలా పని పూర్తయింది. ప్రస్తుతం ఇలాంటి ఫేక్ చలానాలు పట్టుకొని చాలా మంది హన్మకొండ జిల్లాలో తిరుగుతున్నారని తెలిసింది. డబ్బులు దండుకొని కనీసం అప్లయ్ చేయకుండా కాలయాపన చేస్తున్న అక్రమార్కులు ఉన్నారు.

ఎండార్స్‌మెంట్ చూస్తే చాలు..

ప్రతి సేల్‌డీడ్‌లో జాయింట్ రిజిస్ట్రార్లు ఎండార్స్‌మెంట్ డిటెయిల్స్, చలానా పరిశీలిస్తే వాస్తవాలు తెలిసిపోతాయని మీ‌సేవా నిర్వాహకులు అంటున్నారు. చలానాలో ఎంత అమౌంట్ ఉంటుందో, అంతే అమౌంట్ ఎండార్స్‌మెంట్‌లో ఉండాలి. ఈ ఎండార్స్‌మెంట్ భూ భారతి (అంతకు ముందు ధరణి) పోర్టల్ క్రియేట్ చేస్తుంది. దీనిపై సంతకం చేసే ముందు జాయింట్ రిజిస్ట్రార్ దీన్ని స్టడీ చేస్తే ఏమైనా తేడా ఉంటే తెలిసిపోతుంది. ప్రతి జాయింట్ రిజిస్ట్రార్ ఈ పేజీపై సంతకం చేశాక ఈ ఫైల్‌ను అప్‌లోడ్ చేస్తారు. అయితే, ఫేక్ చలానాలు అప్ లోడ్ చేసే వారు డౌన్ లోడ్ చేసి, కొనుగోలుదారుడికి అందించేటప్పుడు మాత్రమే పీడీఎఫ్ ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ పని భూభారతి ఆపరేటర్లు తలచుకుంటేనే జరుగుతుందనే చర్చ ఉన్నది.

నాడే ఆడిట్‌‌కు అనుమతిస్తే..

ధరణి పోర్టల్ అమల్లోకి రాకముందే రాష్ట్ర వ్యాప్తంగా 19 తహశీల్దార్ కార్యాలయాలను రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడిపించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అప్పట్లో ఆ కార్యాలయాల్లో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ లావాదేవీలు జరిపేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. పైలెట్ ప్రాజెక్టు చేపట్టినప్పుడే జిల్లా రిజిస్ట్రార్లు ఆడిట్ చేసేందుకు ఆ కార్యాలయాలకు వెళ్లారు. అయితే తామంతా రెవెన్యూ శాఖకు కింద పని చేస్తున్నామని, తమ కార్యాలయాల్లోకి రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పెత్తనం ఏమిటని, ఆడిట్ చేయకుండా తిప్పి పంపినట్లు సబ్ రిజిస్ట్రార్ల సంఘం నాయకుడొకరు ‘దిశ’ తెలిపారు. నిజానికి ఆ రోజుల్లోనే ఆడిట్‌కు అవకాశం చేయనిచ్చి ఉంటే.. ఆ ప్రక్రియ ఏయేటికాయేడు పూర్తయ్యేది. ఎక్కడైతే లోపాలు తలెత్తాయో వాటిని నాలుగేండ్ల క్రితమే గుర్తించే చాన్స్ లభించేది. అప్పట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను మాత్రం రెవెన్యూ శాఖకు కట్టబెట్టారు. కానీ ఆడిట్ బాధ్యతలను గాలికొదిలేశారు. కనీసం ఏనాడూ రిజిస్ట్రేషన్ల మీద రివ్యూ, ఆడిట్ చేయలేదు. అత్యధిక రెవెన్యూని సంపాదించి పెడుతున్న రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై ధరణి, భూ భారతి అమలు కాలాల్లో ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమని ఆరోపించారు. స్లాట్ బుక్ కాగానే రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ చేతిలో పెట్టడమే అధికారంగా భావించారు. కానీ ఇందులోని టెక్నికల్ ఇష్యూస్ గుర్తించకపోవడం బాధ్యతారాహిత్యంగా అభివర్ణిస్తున్నారు. సేల్ డీడ్, ఇతర డీడ్స్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేసినా, ఆటోమెటిక్ మ్యుటేషన్ చేసే టెక్నాలజీ ఉంది. ప్రస్తుతం నాన్ అగ్రికల్చర్ సేల్ డీడ్స్ చేయగానే ఆటోమెటిక్ మ్యుటేషన్ పూర్తవుతుంది. అదే ప్రక్రియను వ్యవసాయ భూములకు కూడా వర్తింపజేయడం ద్వారా రిజిస్ట్రేషన్ల వ్యవహారమంతా మునుపటి మాదిరిగానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే పూర్తయ్యేదంటున్నారు. ఇలాంటి ఫేక్ చలాన్ల ఉదంతానికి అవకాశం ఉండేది కాదని వాదిస్తున్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై సునిశిత పరిశీలన చేయడం ద్వారా మెరుగైన వ్యవస్థ ఏర్పడుతుందంటున్నారు.

మీసేవ నిర్వాహకులు మాత్రమే బాధ్యులా..?

ఎవరో ఒకరు చేసిన తప్పుడు పని వల్ల తామందరినీ బద్నాం చేయడం సరైంది కాదని తెలంగాణ మీసేవా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎండీ వాహిద్, ఎండీ మోహిన్, కే శ్రీనివాస్, సి.సత్యనారాయణలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. సిటిజన్ లాగిన్ లోకి వెళ్లి ఎవరైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చని,. ఆన్ లైన్ బ్యాంకింగ్ లేదా నేరుగా వెళ్లి చలానా కట్టే వీలుందని చెప్పారు. టెక్నికల్ నాలెడ్జ్ సరిగ్గా లేని వారు మాత్రమే స్లాట్ బుక్ చేసుకోవడానికి తమ దగ్గరికి వస్తారన్నారు. ప్రతి ట్రాన్సాక్షన్ లో చలానా, ఎండార్స్ మెంట్ డిటెయిల్స్ ను తహశీల్దార్లు పరిశీలిస్తే.. ఈ తేడాలకు అవకాశమే ఉండదన్నారు.

Next Story