మలక్కా పోర్టుతో చైనాకు చెక్?

by Muthe.Rajitha |

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటన కీలక మన దేశానికి వ్యూహాత్మక రాబట్టింది.

మలక్కా పోర్టుతో చైనాకు చెక్?
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటన కీలక మన దేశానికి వ్యూహాత్మక రాబట్టింది. ఇండోనేషియాతో కలిసి సబాంగ్ పోర్టు నిర్మాణానికి అంగీకారం కుదిరింది. ఈ నిర్మాణం పూర్తయితే చైనాకు దాదాపు 80 శాతం ట్రేడ్ జరిగే మలక్కా దీవిపై భారత్ సులువుగా ఓ కన్నేసి పెట్టొచ్చు. మరోవైపు అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్ర ప్రభుత్వం కారిడార్ నిర్మించతలపెట్టింది. ఇది కూడా పూర్తయితే మలక్కా జలసంధి గుండా ప్రయాణించే ప్రతి చైనా నౌకపై భారత్ నజర్ వేసి ఉంచొచ్చు. పాకిస్తాన్‌కు తరుచూ అండగా నిలుస్తున్న.. వ్యూహాత్మకంగా మద్దతునిస్తున్న చైనాకు ముచ్చెమటలు పట్టించే ఈ సబాంగ్ పోర్టుపై కీలక ముందడుగు పడింది. అలాగే, ఆపరేషన్ సిందూర్‌లో సత్తాచాటిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణులు, అస్త్రా మిస్సైళ్లు ఇండోనేషియాను విక్రయించనుంది. ఈవీఎంలు విక్రయించడానికీ ఇండోనేషియాతో డీల్ ఫిక్స్ అయింది. రెండు రోజుల ఇండోనేషియా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ నిన్న ఆ దేశ పార్లమెంటులో కీలకోపన్యాసం చేశారు.

అంతకు ముందు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబొవో సుబియాంతో.. ప్రధాని మోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం బింతాంగ్ రిపబ్లిక్ ఇండోనేషియా ఆదిపూర్ణ ప్రదానం చేశారు. ‘మా దేశం అందించే అత్యున్నత పురస్కారం ఇది. భారత్, ఇండోనేషియాల మధ్యనున్న పురాతన బంధం, చెక్కుచెదరని వ్యూహాత్మక విశ్వసనీయతకు తాము అందించిన పురస్కారం నిదర్శనం’ అని జాయింట్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో సుబియాంతో పేర్కొన్నారు. ‘ఇండోనేషియా అత్యున్నత పురస్కారం నాకు ప్రదానం చేశారు. ఈ అవార్డు కోట్లాది మంది భారతీయులదే. ఇండోనేషియా ప్రజల సెంటిమెంట్లకు ప్రతిరూపం. రెండు దేశాల మధ్యనున్న చారిత్రక, లోతైన బంధాలకు నిదర్శనం. ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో, ఈ దేశ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ప్రధాని మోడీ తెలిపారు.

రామాయణం, మహాభారతంలో మన మూలాలు

జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. సంగీతం, నృత్యం, కట్టడాలు, సంస్కృతి, ఆహారపుటలవాట్లు సహా భారత్, ఇండోనేషియా దేశాల మధ్య విడదీయరాని చారిత్రక బంధాలున్నాయని వివరించారు. ఇండోనేషియా జాతీయ గుర్తు గరుడతోనూ భారత్‌కు పురాతన సంబంధమున్నదన్నారు. ఇండియా, ఇండోనేషియా, ఇండియన్ ఒషెన్.. ఈ మూడు పేర్లు లోతైన సంబంధాలను వెల్లడిస్తున్నాయని తెలిపారు. వేల ఏళ్లుగా ప్రపంచానికి ఈ రెండు దేశాల పోర్టుల ద్వారా వాణిజ్యం, సంస్కృతి విస్తరించిందని వివరించారు. పురాతన గ్రంథాలు రామాయణం, మహాభారతంలో రెండు దేశాల ఉమ్మడి మూలాలున్నాయని చెప్పారు.

సబాంగ్ పోర్టు.. మాస్టర్‌స్ట్రోక్

సుమత్రా దీవిలోని ఉత్తరాదివైన సబాంగ్ పోర్టు ఉమ్మడిగా నిర్మించాలని ఇరుదేశాలు అంగీకరించాయి. ఇండోనేషియా, సింగపూర్‌ల మధ్యనున్న మలక్కా జలసంధి అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గం. ఈ జలమార్గం గుండా 40 శాతం అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతుంది. ముఖ్యంగా చైనాకు వచ్చే 80 శాతం ముడి చమురు రవాణా ఈ మలక్కా జలసంధి గుండానే వస్తున్నది. ఈ జలసంధి ఉత్తరముఖ ప్రవేశమార్గాన్ని సబాంగ్ పర్యవేక్షిస్తుంది. ఇక్కడ ఇండోనేషియా, ఇండియాలు ఉమ్మడిగా పోర్టు నిర్మిస్తే చైనాపై భారత్‌ వ్యూహాత్మక పైచేయిని కలిగి ఉంటుంది. దీనికితోడు సబాంగ్ పోర్టు నుంచి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో భారత్‌కు చెందిన చిట్టచివరి పాయింట్ వద్ద గ్రేట్ నికోబార్ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్‌ను కేంద్రం నిర్మించబోతున్నది. మలక్కా దీవికి ఈ హబ్ ఒకవైపు, సబాంగ్ పోర్టు మరోవైపు ఉండటంతో జలసంధిని పూర్తిగా భారత్‌ నిఘానేత్రంలో ఉండనుంది.

సన్నగా ఉండే ఈ మలక్కా జలసంధిపై వాణిజ్యానికి అత్యధికంగా ఆధారపడటం చైనాకూ ఇష్టం లేదు. కానీ, మరో గత్యంతరం లేదు. అందుకే చైనా దీన్ని ‘మలక్కా డైలామా’ అని భావిస్తుంది. ఈ జలసంధిపై భారత్ బలమైన పట్టు తెచ్చుకుంటే చైనాకు కట్టడి చేయడం తేలిక. సబాంగ్ పోర్టు నిర్మిస్తే కేవలం వాణిజ్యాని కోసమే కాదు.. భారత్ నావికా దళానికి రీఫ్యూయలింగ్, నేవిగేషన్, ఇతర లాజిస్టికల్ సేవలు అందుతాయి. మరోవైపు ఇండోనేషియాతో 2002 నుంచి ఇండోనేషియాతో భారత నావికాదళం మిలిటరీ డ్రిల్ చేపడుతుండటం గమనార్హం. కాబట్టి, అండమాన్ నికోబార్ కారిడార్, సబాంగ్ పోర్టు అందుబాటులోకి వస్తే హిందూ మహాసముద్రంపై భారత్ పైచేయి సాధించవచ్చు. చైనాను కట్టడిలోకి తీసుకోవచ్చు. వన్ బెల్ట్, వన్ రోడ్ ద్వారా భారత్ చుట్టూ చైనా తన పట్టును బలపరుచుకునే ప్రయత్నాలు చేసింది. సబాంగ్ పోర్టుద్వారా భారత్ దీన్ని కౌంటర్ చేయగలదు.

బ్రహ్మోస్, ఈవీఎంలపై డీల్

భారత్‌ నుంచి బ్రహ్మోస్, అస్త్రా క్షిపణులను కొనుగోలు చేయడానికి ఇండోనేషియా ఒప్పందం చేసుకుంది. అలాగే, ఈవీఎంలనూ దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. దీనిపైనా సంతకాలు జరిగాయి. అమెరికా, భారత్ తర్వాత మూడో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఇండోనేషియా ఇప్పటికీ బ్యాలెట్ పేపర్లనే ఎన్నికలకు వాడుతున్నది. వియత్నాం, ఫిలిప్పీన్స్‌ల తర్వాత బ్రహ్మోస్ క్షిపణులను ఇండోనేషియాకు భారత్ విక్రయించనున్నది.

Next Story