వివాహేతర సంబంధం.. ఏడాదిన్నర పాపను గోడకేసి కొట్టిన లవర్

by Muthe.Rajitha |

విజయవాడ నగరంలో 18 నెలల పసిపాపను ఓ యువకుడు గోడకేసి కొట్టి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివాహేతర సంబంధం.. ఏడాదిన్నర పాపను గోడకేసి కొట్టిన లవర్
X

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ నగరంలో అత్యంత కిరాతకమైన ఘటన వెలుగుచూసింది. కేవలం 18 నెలల పసిపాపను ఓ యువకుడు గోడకేసి కొట్టి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధం మరియు క్షణికావేశం ఒక పసిప్రాణాన్ని బలితీసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన ఒక వివాహితకు తన భర్త స్నేహితుడితో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడంతో, ఆమె తన ఇద్దరు పిల్లలతో (ఐదేళ్ల బాబు, 18 నెలల పాప) కలిసి అతనితో విజయవాడలో సహజీవనం చేస్తోంది. అయితే, ఇటీవల వీరిద్దరి మధ్య తరచూ మనస్పర్థలు తలెత్తుతున్నాయి. బుధవారం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో, ఆగ్రహానికి లోనైన యువకుడు ఆ మహిళ కుమార్తెను పట్టుకుని బలంగా గోడకేసి కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

అకస్మాత్తుగా చిన్నారి చనిపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు విజయవాడ పరిసరాల్లో గాలించి వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డు వస్తోందనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు.

Next Story