అత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు.. మున్సిపల్ వైస్ చైర్మన్ అరెస్ట్!

by Web Desk |
అత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు.. మున్సిపల్ వైస్ చైర్మన్ అరెస్ట్!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: గత నెలలో సంచలనం సృష్టించిన బాలికపై అత్యాచారం కేసును నిర్మల్ పోలీసులు ఛేదించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన‌ నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ ను అరెస్టు చేశారు. ఆయనకు సహకరించిన అన్నపూర్ణ అనే మహిళ, జాఫర్ అనే డ్రైవర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి విలేకరులకు వెల్లడించారు.

నిర్మల్ పట్టణంలోని వైఎస్సార్ నగర్ కాలనీలో నివాసముండే అన్నపూర్ణ తో మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ కు పరిచయం ఏర్పడింది. అన్నపూర్ణ ఇంటి పక్కనే ఉండే బాధితురాలిని తన వద్దకు పంపించాలని, దానికి బదులుగా ఒక ఇంటి ఫ్లాట్ (డబుల్ బెడ్రూం) బ‌హుమ‌తిగా ఇస్తానని అన్నపూర్ణకు ఆశ చూపించాడు. అయితే అన్నపూర్ణ.. తమ బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని మాయమాటలు చెప్పి బాధితురాలి తల్లికి బాలిక‌ను తన‌తో పంపించాలని కోరింది.

అన్నపూర్ణ తన ఇద్దరు కుమారులతో పాటు బాధితురాలిని తీసుకొని నిజామాబాద్ వెళ్లకుండా మున్సిపల్ వైస్ చైర్మన్ తో కారులో హైదరాబాద్ కు తీసుకెళ్లింది. హైదరాబాద్ లోని ఒక లాడ్జిలో బాధితురాలిపై వైస్ చైర్మన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తాడని బాధితురాలిని అన్నపూర్ణ బెదిరించడంతో ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. తిరిగి 10న వారిని నిర్మల్ కు పంపించాడు.

ఈ విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పడం తో ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కి తీసుకెళ్లగా. బాధితురాలిని సఖి సెంటర్ కు పంపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితురాలు అడ్వకేట్ ను కలిసేందుకు నిర్మల్ వస్తుండగా నీలాయి పేట శివారులో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని డీఎస్పీ పేర్కొన్నారు. వీరిపై ఫోక్స్ చట్టం 363, 376 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక కారు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.


Next Story

Most Viewed