ఇక వొడాఫోన్-ఐడియా నిష్క్రమిస్తుందా ?

by  |
vodaphone
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాకు పెరుగుతున్న నష్టాలు, రుణాల ఒత్తిడి ఆ సంస్థ రుణదాతలను ప్రభావితం చేయవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. అంతేకాకుండా కంపెనీ ఉద్యోగులు, సబ్‌స్క్రైబర్లపై ప్రభావం చూపుతుందని, ఈ సమయంలో ప్రభుత్వం మద్దతు కీలకమని ఇక్రా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. స్పెక్ట్రమ్ బకాయిలను వాయిదా వేయడం, సుంకాలు, వడ్డీ రేట్లను తగ్గించడం, ఇంకా ఇతర సహాయక చర్యల ద్వారా కంపెనీ ఆర్థిక పరిస్థితిని, పరిశ్రమకు తోడ్పాటునందించవచ్చని ఇక్రా పేర్కొంది. వొడాఫోన్ ఐడియా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి కారణంగా అనుబంధంగా ఉన్న పరిశ్రమలు, మరీ ముఖ్యంగా టెలికాం టవర్ల నిర్వాహకులు సవాళ్లను ఎదుర్కొంటారని ఇక్రా వివరించింది.

ఒకవేళ ఆర్థిక ఒత్తిడి పెరిగిపోయి వొడాఫోన్ ఐడియా పరిశ్రమ నుంచి నిష్క్రమిస్తే టవర్ పరిశ్రమలో ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాకు చెందిన 1,80,000 టవర్ల అద్దెదారులు ఇబ్బందులను ఎదుర్కొంటారని తెలిపింది. వీరిలో 40-50 శాతం అద్దెదారులు 18-24 నెలల్లోగా తమ చెల్లింపులను పొందాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వొడాఫోన్ ఐడియాకు బయటనుంచి(ప్రధానంగా ప్రభుత్వం నుంచి) మద్దతు అవసరం ఉంటుందని ఇక్రా పేర్కొంది. 2019 నుంచి వొడాఫోన్ ఐడియాకు కష్టాలను చూస్తోంది. గత 12 త్రైమాసికాల్లో ఈ నష్టం భారీగా పెరిగింది. ప్రస్తుత ఏడాది జూన్ 30 నాటికి సంస్థ మొత్తం అప్పులు రూ. 2 లక్షల కోట్లకు పైగా పెరిగాయి.


Next Story

Most Viewed