టీఎస్‌పీఎస్‌సీ‌పై మాస్ ట్రోలింగ్.. ఎన్నికల వేళ సరికొత్త డిమాండ్!

by Disha Web Desk 2 |
టీఎస్‌పీఎస్‌సీ‌పై మాస్ ట్రోలింగ్.. ఎన్నికల వేళ సరికొత్త డిమాండ్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) గ్రూప్‌-2 పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ సారి వాయిదాకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడే కారణం కావడం గమనార్హం. 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి టీఎ్సపీఎస్సీ గత ఏడాది నోటిఫికేషన్‌(28/2022)ను జారీ చేయగా.. 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ తొలుత ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండడంతో.. గ్రూప్‌-2ను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు, రాజకీయ పార్టీల నుంచి డిమాండ్లు వచ్చాయి. అప్పట్లో ఆందోళనలు ఉధృతమవుతున్న తరుణంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎ్సపీఎస్సీ ప్రకటించింది. నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్‌-2ను నిర్వహిస్తామని పేర్కొంటూ.. అందుకు ఏర్పాట్లను చేస్తోంది.


అయితే.. తెలంగాణతోపాటు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సోమవారం ప్రకటన చేయడంతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో సమావేశం నిర్వహించి గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. దీంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల పేరు చెప్పి ప్రిపేర్ అవుతున్న వేళ వాయిదా వేయడం కరెక్ట్ కాదని ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా మరో అనూహ్య డిమాండ్ తెరమీదకు తెచ్చారు. ఎన్నికల నిర్వహణ కూడా టీఎస్‌పీఎస్‌సీకి ఇవ్వాలని కోరుతున్నారు. లీడర్లు అందరూ ప్రచారం చేసి అలిసి పోయి, డబ్బులు, మద్యం పంచినాక రద్దు అయితే కావాలని, అప్పుడు నిరుద్యోగుల బాధ ఏంటో అందరికీ తెలుస్తుందని భావిస్తున్నారు. దీనికి సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు.



Next Story

Most Viewed