పెన్షన్ల పెంపు ఒక పెద్ద జోక్.. సీఎం కేసీఆర్‌పై షర్మిల సెటైర్స్

by Disha Web Desk 19 |
పెన్షన్ల పెంపు ఒక పెద్ద జోక్.. సీఎం కేసీఆర్‌పై షర్మిల సెటైర్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్.. మళ్లీ కొత్త కథ మొదలుపెట్టాడని, ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందని, దీన్ని నమ్మాలా అని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఆదివారం ఒక ప్రకటనలో ఎద్దేవాచేశారు. కొండంత రాగం తీసి పిల్లికూత కూసినట్లుగా కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ఉందని ఆమె చురకలంటించారు. పోయిన ఎన్నికలకు ఇచ్చిన హామీలే నెరవేర్చే దిక్కు లేదని సెటైర్లు వేశారు. బతుకు మీద ఇవ్వాల్సిన ధీమా పక్కన పెట్టి పోయాక బీమా ఇస్తాననడం సిగ్గుచేటని మండిపడ్డారు. సున్నా వడ్డీకే రుణాలిస్తానని దొర మోసం చేశారని ఫైరయ్యారు.

నిరుద్యోగ భృతి ఇస్తామని గత మేనిఫెస్టోలో పెట్టిన పథకానికే దిక్కులేదని, అలాంటిది రూ.3 వేలు ఇస్తామంటే నమ్మాలా? అని ధ్వజమెత్తారు. విడతల వారీగా పెన్షన్ల పెంపు ఒక పెద్ద జోక్ అని ఆమె ఎద్దేవాచేశారు. రుణమాఫీపై దొర యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వలేక ఏనాడో సీఎం చేతులెత్తేశారని, ఉన్న పథకాలను పాతర పెట్టి ఓట్ల కోసం కొత్త పథకాలు అంటూ డ్రామాలు తప్ప మరోటి లేదని ఆమె ఫైరయ్యారు. బందిపోట్ల సమితి మేనిఫెస్టో కేవలం ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదని షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Next Story