ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు నీళ్లు గాలిలో తెస్తావా.. మాజీ మంత్రి హరీశ్ రావు

by Kema Shiva Kumar |

కాళేశ్వరంలో భాగమే మల్లన్నసాగర్‌ అని.. ఆ ప్రాజెక్టుకు నీరు వచ్చేది కూడా కాళేశ్వరం నుంచే అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు.

ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు నీళ్లు గాలిలో తెస్తావా.. మాజీ మంత్రి హరీశ్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరంలో భాగమే మల్లన్నసాగర్‌ అని.. ఆ ప్రాజెక్టుకు నీరు వచ్చేది కూడా కాళేశ్వరం నుంచే అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు. రూ.7,000 కోట్లతో ప్రారంభించబోతున్న ఈ పథకం కాళేశ్వరం నీళ్లతో కాదా అని నిలదీశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 15 రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్నసాగర్ అని చెప్పారు. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే సీఎం కుర్చీకున్న గౌరవం తగ్గుతుందన్నారు. కేసీఆర్ ముందుచూపుతో హైదరాబాద్ మంచి నీటి కోసం మల్లన్నసాగర్‌లో స్లూయిస్ నిర్మించి పెట్టారని అన్నారు. రేవంత్‌రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏం లేదని మరోసారి రుజువయిందన్నారు. ఆయన మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుందన్నారు. గోబల్స్‌ని మించిపోయారని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును తామే కట్టామని అంటున్నారని.. కానీ పూర్తిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. రేవంత్ లాగా దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయాలకు కేసీఆర్ పాల్పడలేదని.. కాంగ్రెస్ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జి, ఆర్అండ్ఆర్, ల్యాండ్ అక్విజేషన్ పూర్తి కాలేదని, గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదని చెప్పారు.

టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టును రూ.2,052 కోట్లతో పూర్తి చేసి 2016లో పూర్తిస్థాయిలో 20 టీఎంసీల నీళ్లు నింపామని వెల్లడించారు. రేవంత్ కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నారని.. ఎక్కడ రిబ్బన్ కనిపిస్తే అక్కడ కత్తిరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించిన ట్యాంకులు కేసీఆర్ హయాంలో ప్రారంభించినవేనని చెప్పారు. హైదరాబాద్‌కు నీళ్ల కోసం శంకుస్థాపన చేసినా.. కాళేశ్వరం నీళ్లనే తీసుకెళ్తున్నారని అన్నారు. ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీలు అని.. డెడ్ స్టోరేజ్ మూడు టీఎంసీలు అని.. మిగిలిన 17 టీఎంసీల్లో సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలకు 12 టీఎంసీలు పోతాయని చెప్పారు. ఇక ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఆరున్నర టీఎంసీలు ఇవ్వాలని.. మంచిర్యాల నియోజకవర్గంలో గూడెం లిఫ్ట్కు మూడు టీఎంసీలు అవసరమని.. రామగుండం లిఫ్ట్‌కు ఒక టీఎంసీ వాడుతారని తెలిపారు. ఎల్లంపల్లి సామర్థ్యానికి మించి వాడుతున్నామని.. కెపాసిటీకి మించి మరో 20 టీఎంసీలు హైదరాబాద్‌కు ఎలా తెస్తావు రేవంత్‌రెడ్డి అని ప్రశ్నించారు. ఎల్లంపల్లి నుండి మల్లన్నసాగర్‌కు నీళ్లు గాలిలో వస్తున్నాయా అని నిలదీశారు.

జనం బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే..

అధికార మదంతోనో, ధన బలంతోనో తిమ్మినిబమ్మిని చేద్దామని చూస్తే జనం సహించరని.. తిప్పికొడతారని.. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హరీశ్‌రావు హెచ్చరించారు. మంచి పనులు చేస్తే తామూ సహకరిస్తామని చెప్పారు. మల్లన్నసాగర్ 2008, 2009లో రాజశేఖర్‌రెడ్డి కట్టించారని రేవంత్ అంటున్నారని.. అసలు ఎల్లంపల్లి నిర్మాణంలో మల్లన్నసాగర్ ప్రస్తావనే లేదని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి బతికుంటే ఈ అబద్ధాలు విని సిగ్గుతో తలదించుకునేవారని అన్నారు. సాగునీటి అవసరాల కోసం కేసీఆర్ 50 టీఎంసీల మల్లన్న సాగర్ నిర్మించారని తెలిపారు. ఆ ప్రాజెక్టును ఆపాలని ఇదే రేవంత్‌రెడ్డి 48 గంటలకు దీక్ష చేశారని ఆరోపించారు. మల్లన్నసాగర్ కడితే ఆ ప్రాజెక్టు కింద ఒక్కో రైతుకు రెండెకరాలు పండే భూమిని ఇవ్వాలని అన్నారని.. మూసీలో దాదాపు 300 ఇళ్లు ఖాళీ చేపించి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూంలు వారికి ఇచ్చారని అన్నారు. మూసీలో ఖాళీ చేయించిన వారికి రూ.25 వేల చెక్కు ఇస్తే అవి బౌన్స్ అయ్యాయన్నారు. మూసీ నిర్వాసితులకు 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ ఈరోజు హైదరాబాదుకు, రైతులకు వరంగా మారిందన్నారు. నోరు ఉంది కదా అని గావుపెట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావన్నారు. 152 మీటర్లకు అగ్రిమెంట్ ఉండగా మేడిగడ్డకు ఎందుకుపోయారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ‌రేవంత్‌రెడ్డి ప్రశ్నించారని.. ఇప్పుడు వారే తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్లకు అగ్రిమెంట్ ఉందని ఒప్పుకున్నారని అన్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చి చూపించాలని సవాల్ విసిరారు. 148 మీటర్ల వద్ద బ్యారేజీ కడితే కేవలం 50 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకోలేమని చెప్పారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి జిల్లాకు హామీలు ఏమైనా ఇస్తారేమో అని అనుకున్నామని.. కానీ ఎప్పటిలాగే కేసీఆర్ మీద విమర్శలు చేసి వెళ్లిపోయారని అన్నారు.

గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలు..

పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్‌రెడ్డి.. ఈ కోర్టు తీర్పునకు చెప్పే సమాధానం ఏమిటని నిలదీశారు. హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ ప్రభుత్వం నిర్లక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారని పేర్కొన్నారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలనే సోయి కూడా లేదని తెలిపారు. విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు రేవంత్‌రెడ్డి.. మోసపూరిత వైఖరికి సిగ్గుతో తలదించుకోవాలని.. యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story