ఏపీ, క‌ర్ణాట‌క‌లో సోష‌ల్ మీడియాపై ఆంక్ష‌లు.. మ‌రి తెలంగాణ‌లో?

by Ajay Maddhiboyina |

ఏపీ, క‌ర్ణాట‌క‌లో సోష‌ల్ మీడియాపై ఆంక్ష‌లు విధించారు. దీంతో తెలంగాణ‌లోనూ ఆంక్ష‌లు విధించాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఏపీ, క‌ర్ణాట‌క‌లో సోష‌ల్ మీడియాపై ఆంక్ష‌లు.. మ‌రి తెలంగాణ‌లో?
X

దిశ‌, వెబ్ డెస్క్: సోష‌ల్ మీడియా వ‌ల్ల మంచి కంటే చెడే ఎక్కువ జ‌రుగుతుంది అనేది కాద‌న‌లేని స‌త్యం. ముఖ్యంగా ఈ మ‌ధ్య కాలంలో చిన్న‌పిల్ల‌ల‌పై సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెరిగిపోతోంది. ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సాప్, స్నాప్ చాట్ అంటూ చ‌దువును ప‌క్క‌న పెట్టేస్తున్నారు. చ‌దువును ప‌క్క‌న పెట్ట‌డ‌మే కాకుండా 24 గంట‌లూ ఫోన్లు చూస్తూ... వాటికే అడిక్ట్ అయ్యి మెంట‌ల్ హెల్త్ ను పాడు చేసుకుంటున్నారు. మ‌రికొంద‌రు అయితే ఏకంగా స్కూల్ వ‌య‌సులోనే సోష‌ల్ మీడియా ప‌రిచ‌యాల వ‌ల్ల జీవితాల‌ను నాశనం చేసుకుంటున్నారు. 10th క్లాస్ కూడా పూర్తి చేయ‌కుండానే ప్రేమ‌, పెళ్లి అంటూ ఇంట్లో నుండి పారిపోతున్నారు. అలా ఇంటి నుండి వెళ్లిన పిల్ల‌ల‌పై అత్యాచారం జ‌ర‌గ‌టం, టార్చ‌ర్ చేయ‌డం లాంటి ఘ‌ట‌న‌లు కూడా బోలెడు ఉన్నాయి.

ఇలాంటి ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాపై ఆంక్ష‌లు విధించాల‌నే డిమాండ్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా రెండు రాష్ట్రాలు చేసిన ప్ర‌క‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. క‌ర్ణాట‌క‌లో 16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియాపై బ్యాన్ విధిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. పిల్ల‌లు ఫోన్లను అధికంగా వినియోగించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌తికూల ప్ర‌భావాల‌ను నివారించడ‌మే త‌మ లక్ష్యం అని సీఎం సిద్ద‌రామ‌య్య అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. దీంతో దేశంలో సోష‌ల్ మీడియాపై ఆంక్ష‌లు విధించిన మొద‌టి రాష్ట్రంగా క‌ర్ణాట‌క‌ నిలిచింది. ఇక క‌ర్ణాట‌క అసెంబ్లీలో సోష‌ల్ మీడియాపై ఆంక్ష‌లు విధించిన‌ట్టు ప్ర‌క‌ట‌న‌ చేసిన రోజే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలోను సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

13 ఏళ్ల లోపు పిల్ల‌ల‌పై సోష‌ల్ మీడియా నిషేదం విధిస్తామ‌ని ప్ర‌క‌టించారు. 90 రోజుల్లో దీన్ని అమ‌లు చేసే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని చెప్పారు. 13 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు బ్యాన్ చేయాలా.. 16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు బ్యాన్ చేయాలా అనే అంశంపై ఆలోచ‌న చేస్తున్నామ‌ని అన్నారు. సోష‌ల్ మీడియా వ‌ల్ల న‌ష్టం జ‌ర‌గ‌కూడ‌దు అనేదే త‌మ ఆలోచ‌న అని స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీలో టీనేజ్ ప్రెగ్నెన్సీల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన మ‌రుస‌టి రోజే చంద్ర‌బాబు ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఇక ఇదే బాట‌లో గోవా కూడా ఉంది.

చిన్న‌పిల్ల‌లు సోష‌ల్ మీడియా వాడ‌కంపై ఆంక్ష‌లు విధించే అంశంపై ప‌రిశీలిస్తున్న‌ట్టు అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇలా వ‌రుస పెట్టి ప‌లు రాష్ట్రాలు పిల్ల‌ల‌పై సోష‌ల్ మీడియా నిషేదం దిశ‌గా అడుగులు వేస్తుండ‌టంతో తెలంగాణ‌లోనూ అలాంటి చ‌ర్య‌లే తీసుకోవాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ‌లోనూ 16ఏళ్ల లోపు వారిపై సోష‌ల్ మీడియా బ్యాన్ చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో స్కూల్ విద్యార్థినిపై అత్యాచారం జ‌రిగింది. ముగ్గురు యువ‌కులు యువ‌కులు బాలిక‌ను తీసుకువెళ్లి మ‌ద్యం తాగించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

ఈ ఘోరానికి కార‌ణం సోష‌ల్ మీడియానే. ఇది కేవ‌లం ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. త‌వ్వుకుంటూ పోతే ఇలాంటి ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. కాబ‌ట్టి ఇలాంటి నేరాల‌ను అరిక‌ట్టాలంటే ఆంక్ష‌లు విధించ‌డ‌మే బెట‌ర్ అనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. క‌ర్ణాట‌క‌, ఆంధ్ర ప్ర‌దేశ్ మాధిరిగా తెలంగాణ ప్ర‌భుత్వం కూడా త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుకోవాల‌ని డిమాండ్లు వ‌స్తున్నాయి. సాధార‌ణంగా 16ఏళ్ల లోపు వాళ్లే కాకుండా ఆపై వ‌య‌సు వాళ్ల‌పైనా సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఉంటుంది. అయితే ఆపై వ‌య‌సు వాళ్లకు ఆలోచ‌నా శ‌క్తి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది.

ఎవ‌రిని న‌మ్మాలి.. ఎవ‌రిని న‌మ్మ‌కూడదు.. మ‌న లిమిట్స్ ఏంటి అనే విష‌యాలు తెలిసి ఉంటాయి. కానీ చిన్న‌పిల్ల‌లు అలా కాదు.. ఎవ‌రిని న‌మ్మాలి... ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దు అనే మెచ్యురిటీ ఉండ‌దు. సోష‌ల్ మీడియా వ‌ల్ల టైమ్ పాస్ అవుతుంద‌నే ఆలోచిస్తారు. కానీ జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల గురించి ఆలోచించ‌లేరు. మ‌రోవైపు మెచ్యురిటీ త‌క్కువ ఉండ‌టం వ‌ల్ల మోసం చేసేవాళ్లు కూడా సుల‌భంగా టార్గెట్ చేసే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా బ్యాన్ అంశాన్ని ప్ర‌తి ఒక్క‌రూ స్వాగ‌తిస్తున్నారు. ఆ దిశ‌గా వెళుతున్న ప్ర‌భుత్వాల‌ను అభినందిస్తున్నారు.

Next Story