"votechori" పై గులాబీ బాస్ మౌనం ఎందుకు?

by Muthe.Rajitha |

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీలేవనెత్తిన "వోట్‌చోరీ"(VoteChori) వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనం రేపుతోంది.

votechori పై గులాబీ బాస్ మౌనం ఎందుకు?
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన "వోట్‌చోరీ"(VoteChori) వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనం రేపుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలలో కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా వోట్ చోరీ జరిగిందని ఆధారాలతో సహా రాహుల్ బయటపెట్టడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహదేవపురలో 1,00,250 నకిలీ ఓట్లు వేయబడ్డాయని, దీని వల్ల బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ సీటు కాంగ్రెస్ చేతిలోంచి BJPకి వెళ్లిందని రాహుల్ ఆరోపిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం(ECI), బీజేపీ(BJP) కుమ్మకై ఈ అక్రమాలకు తెరలేపారని వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.

రాహుల్ చేసిన ఈ ఆరోపణలతో మరోసారి ఓటరు జాబితాలలోని అక్రమాలు, నకిలీ ఓట్లు, నకిలీ చిరునామాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కాగా ఈ వివాదానికి INDIA బ్లాక్‌లోని పలు పార్టీలు (కాంగ్రెస్, సమాజవాదీ పార్టీ, DMK, NCP, ఇతరులు) ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. అలాగే ఈ అంశంపై నిన్న ఢిల్లీలోని పార్లమెంటు భవనం నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన మార్చ్‌ను కూడా నిర్వహించాయి. అయితే, దేశంలో ఇంత పెద్ద వివాదం ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ పార్టీ(BRS Party) మాత్రం మౌనంగా ఉంది.

ఆ పార్టీ ముఖ్య నాయకులైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు నోరు ఎత్తకపోవడంపై రాజకీయ చర్చకు దారితీసింది. "వోట్‌చోరీ" వివాదంపై గులాబీ పార్టీ రాజకీయ వ్యూహం ఏమిటో ఎవరికీ అంతుబట్టకపోయినా.. BJPతో ఉన్న అంతర్గత సంబంధాలే కారణం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రాహుల్ చేస్తున్న ఆరోపణల్లోని ఆధారాలపై స్పష్టత లేకపోవడం కూడా మరో కారణం అయి ఉండవచ్చని అంటున్నారు. దేశ రాజకీయాల కంటే స్థానిక ఎన్నికలే ప్రస్తుతం ముఖ్యమని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.

అంతేకాదు... ఒకవేళ ఈ వివాదంపై రాహుల్ గాంధీకి మద్దతు తెలిపితే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేనని బీజేపీ ఆరోపించే అవకాశం ఉండగా... రాహుల్ ఆరోపణలు ఖండిస్తే బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలని కాంగ్రెస్ మరోవైపు వాయించే అవకాశం ఉండటంతో మధ్యే మార్గంగా కేసీఆర్ తోసహా ఆ పార్టీ నేతలంతా గప్ చుప్ గా సైలెంట్ అయ్యారని వినిపిస్తోంది.

Next Story