- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ కొత్త చీఫ్ సెక్రెటరీ ఎవరు? ఆ ముగ్గురి మధ్యే ప్రధాన పోటాపోటీ!
తెలంగాణ స్టేట్ బ్యూరోక్రసీలో త్వరలోనే పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెలాఖరుతో చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు పదవీకాలం ముగియనుంది. ఆయన సర్వీసును మరోసారి పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్టు తెలిసింది. ఇప్పటికే రెండు సార్లు ఆయన పదవీకాలాన్ని కేంద్రం పొడిగించడంతో, మరోసారి ఎక్స్‌టెన్షన్ లభిస్తుందా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొన్నది. రామకృష్ణారావుకు ఎక్స్‌టెన్షన్ లభించకపోతే.. ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు ముగ్గురు స్పెషల్ సీఎస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఆ జాబితాలో జయేశ్ రంజన్, వికాజ్ రాజ్, సంజయ్ జాజు ఉన్నారు. ఈ ముగ్గురూ 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు. సీనియార్టీలో మొదటి వరుసలో ఉన్న తనకు పదవి కచ్చితంగా వస్తుందని అంచనాలో జయేశ్ రంజన్ ఉండగా, తన సిన్సియార్టీనే తనకు చీఫ్ సెక్రెటరీ పదవి తెచ్చిపెడుతుందని వికాస్ రాజ్ ధీమాలో ఉన్నట్టు తెలిసింది. మరోవైపు కేంద్ర సర్వీసులో ఉన్న సంజయ్ జాజు సైతం చీఫ్ సెక్రెటరీ పదవిని దక్కించుకునేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ నేతల ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. చాలా ఏండ్లుగా కేంద్ర సర్వీసులో పనిచేస్తోన్న జాజుకు రాష్ట్ర రాజకీయ, భౌగోళిక పరిస్థితులపై అవగాహన తక్కువగా ఉంటుందని చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. ప్రస్తుతానికి ఎవరికి వారే తమకు పదవి వస్తుందనే ధీమాలో ఉండగా, వచ్చేవారం కొత్త చీఫ్ సెక్రెటరీ ఎవరు అనే అంశంపై క్లారిటీ వస్తుందని సీఎంవో వర్గాలు తెలిపాయి.
రామకృష్ణారావుకు బంఫరాఫర్?
కేంద్ర ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు పదవీకాలాన్ని మరోసారి పొడిగించకపోతే ఆయన సేవలను ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. అందులోభాగంగా ఆయనకు హైదరాబాద్ మెట్రోరైలు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కేఆర్కేకు ఆఫర్ ఇచ్చినట్టు రాజకీయవర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది. ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతున్నది. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే మెట్రో విస్తరణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకు కావాల్సిన నిధుల సమీకరణ చాలా కీలకం. రామకృష్ణరావుకు చాలా కాలం పాటు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలు చూసిన అనుభవం ఉంది. కేంద్ర ప్రభుత్వంలోని అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీనితో ఆయన ఎక్కువ వడ్డీతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న సుమారు రూ. 25 వేల కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి, ఎక్కువ ఏండ్ల పాటు చెల్లించే విధంగా రీ–షెడ్యూలు చేయించడంలో కీలక పాత్ర పోషించినట్టు టాక్ ఉంది. దీనితో మెట్రో రైలు విస్తరణ కోసం కావాల్సిన నిధుల సమీకరణ ప్రక్రియలో ఆర్థిక రంగంలో అనుభవం ఉన్న రామకృష్ణరావుకు చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుదని ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలిసింది.






