- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త ఐబొమ్మ వెనుక ఎవరు? వెబ్‌సైట్లపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
తెలుగు సినీ పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ భూతం మరోసారి థియేటర్లలో, ఓటీటీల్లో విడుదలైన కొత్త సినిమాలను వెంటనే పైరసీ చేసి ఆన్‌లైన్‌లో పెడుతున్న ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ,తెలంగాణ బ్యూరో: తెలుగు సినీ పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ భూతం మరోసారి థియేటర్లలో, ఓటీటీల్లో విడుదలైన కొత్త సినిమాలను వెంటనే పైరసీ చేసి ఆన్‌లైన్‌లో పెడుతున్న ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాతల కడుపు కొడుతున్న ఈ పైరసీ వెబ్‌సైట్ల వ్యవహారంపై ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు సైబర్ క్రైమ్ పోలీసులకు తాజాగా మరోసారి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సదరు వెబ్‌సైట్ల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బ్రాండ్ ఇమేజ్ వాడుకుంటూ..
గతంలో ఐబొమ్మ వెబ్‌సైట్ తెలుగు రాష్ట్రాల్లో పైరసీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. అయితే, ఇమ్మడి రవి అరెస్ట్ వల్ల ఆ వెబ్‌సైట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. సరిగ్గా ఇదే అదనుగా భావించిన కొందరు సైబర్ కేటుగాళ్లు.. ఐబొమ్మకు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను వాడుకుని పైరసీ దందాకు తెరలేపారు. ఐబొమ్మ పేరుతోనే సరికొత్తగా మరో వెబ్‌సైట్‌ను క్రియేట్ చేశారు. ఇటీవల కాలంలో విడుదలైన చిన్న, పెద్ద సినిమాలన్నింటినీ హెచ్‌డీ ప్రింట్లతో సహా ఈ కొత్త ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లలోకి అక్రమంగా అప్‌లోడ్ చేసి కోట్లాది రూపాయల మేర నిర్మాతలకు నష్టం కలిగిస్తున్నారు.
రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు..
ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లపై కేసులు నమోదు చేశారు. కొత్తగా క్రియేట్ చేసిన ఐబొమ్మ వెబ్‌సైట్‌ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు.. ఏ దేశం నుంచి సర్వర్లను వినియోగిస్తున్నారు.. డొమైన్ రిజిస్ట్రేషన్ వివరాలు ఏమిటి.. అన్న కోణంలో పోలీసులు సాంకేతిక ఆధారాలను ఐపీ అడ్రస్ లను సేకరిస్తున్నారు. సినీ పరిశ్రమను నష్టాల పాలు చేస్తున్న ఈ పైరసీ ముఠాల గుట్టు రట్టు చేసి, నిర్వాహకులను కటకటాల వెనక్కి నెడతామని దర్యాప్తు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నాకు సంబంధం లేదు.. ఇమ్మడి రవి
నెట్టింట తాజాగా చక్కర్లు కొడుతున్న ఈ కొత్త ఐబొమ్మ వెబ్‌సైట్ గతంలో ఆ సైట్‌తో సంబంధం ఉన్నట్లు భావించే రవి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐబొమ్మ పేరును వాడుకుని కొందరు కేటుగాళ్లు కొత్త వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి, అక్రమంగా సినిమాలను అప్‌లోడ్ చేస్తున్నారని ఆయన వివరణ ఇచ్చారు.






