వారెవ్వా లీడరా.. మజాకా! ప్రజాప్రతినిధులపై 290 కేసులు పెండింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-18 02:53:39  IST  )

రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రస్తుతం 290 కేసులు పెండింగులో ఉన్నట్లు పోలీసు శాఖ రికార్డులు చెబుతున్నాయి.

వారెవ్వా లీడరా.. మజాకా! ప్రజాప్రతినిధులపై 290 కేసులు పెండింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రస్తుతం 290 కేసులు పెండింగులో ఉన్నట్లు పోలీసు శాఖ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో సీఎం మొదలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలపైనే 210కి పైగా కేసులు ఉండగా అందులోనూ హైదరాబాద్ సెషన్స్ జడ్జి యూనిట్‌లోనే 201 కేసులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. ఇందులో 24 కేసులు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినవి కాగా.. 16 కేసులు ఎగ్జామినేషన్ లో ఉన్నాయి. 20 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. విచారణ సమయంలో అత్యధిక కేసుల్లో వాయిదాలు తీసుకుంటుండడం వల్లే ఈ కేసులు పెండింగ్‌లో ఉండిపోతున్నాయని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా నమోదవుతున్న కేసుల్లో రాజకీయపరమైనవే ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. మరోవైపు ఇందులో క్రిమినల్ కేసులతోపాటు సీబీఐ, ఏసీబీ కేసులు సైతం ఉండడం గమనార్హం.

సైఫాబాద్ పీఎస్‌లోనే 89 కేసులు

రాష్ట్రవ్యాప్తంగా ఒక్క సైఫాబాద్ పీఎస్ లోనే ఎమ్మెల్యేలపై అత్యధికంగా 89 కేసులు నమోదయ్యాయి. అసెంబ్లీ ముట్టడి, గన్ పార్క్ వద్ద నిరసన సమయాల్లో ఈ పీఎస్ లోనే కేసులు నమోదు చేస్తుండడంతో కేసుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధుల్లో అత్యధికంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై వివిధ పీఎస్ లలో అత్యధికంగా 110 కేసులు నమోదై ఉన్నాయి. ఆ తర్వాత చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై 21 కేసులు ఉన్నాయి. అయితే ఇందులో అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం వంటి వాటి గురించి నమోదైన కేసులే అధికం. అంతేకాకుండా మతపరమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాల్లో నమోదైన కేసులు సైతం ఉన్నాయి. మరోవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్ పై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

కొన్ని కేసులు కొట్టివేసిన కోర్టులు

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలు కేసులు నమోదు కాగా.. తాజాగా వాటిని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. జన్వాడా ఫామ్ హౌస్ పై డ్రోన్లు ఎగరవేశారని బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనపై తప్పుడు ప్రచారం చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిలపై పెట్టిన కేసులను ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆధారాలు లేవని కోర్టు కొట్టివేసింది.

Next Story