కీలకంగా మారిన వాట్సాప్ చాట్ హిస్టరీ.. కేటీఆర్, హరీశ్‌కు నోటీసులు?

by Kema Shiva Kumar |

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమవుతున్నట్టు అధికారికవర్గాల్లో ప్రచారం జరగుతున్నది.

కీలకంగా మారిన వాట్సాప్ చాట్ హిస్టరీ.. కేటీఆర్, హరీశ్‌కు నోటీసులు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమవుతున్నట్టు అధికారికవర్గాల్లో ప్రచారం జరగుతున్నది. ఇప్పటి వరకు సిట్ ఎదుట విచారణకు హాజరైన సస్పెండెడ్, మాజీ పోలీసు అధికారులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వీరిని విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు విచారణకు హాజరైన నిందితులు ప్రణీత్‌రావు మొదలు ప్రభాకర్‌రావు వరకు అందరూ ‘కేటీఆర్, హరీశ్ రావు ఆదేశాల మేరకే’ అనే విషయాన్ని కామన్‌గా చెప్పినట్టు తెలిసింది. వారు చెబితేనే విపక్ష లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ చేశామని ఎంక్వయిరీ సమయంలో ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆదేశాలు ఏ విధంగా ఇచ్చారు? అనే అంశంపై ఆరా తీయగా.. కొన్ని సార్లు మౌఖికంగా, మరికొన్ని సార్లు వాట్సాప్ మెసేజ్‌లు పంపించారని వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో సిట్ అధికారులు కేటీఆర్, హరీశ్ రావును ఎంక్వయిరీకి పిలిచే అవకాశాలు ఉన్నట్టు అధికారిక వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

వాట్సాప్ హిస్టరీ రికవరీ

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, సస్పెండెడ్, మాజీ పోలీసు అధికారులు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ నేతలను విచారించేందుకు సిట్ సిద్ధమైంది. విపక్ష లీడర్ల ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు నాటి ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు వాట్సప్ మెసేజ్‌లు, సిగ్నల్, ఫేస్ టైమ్ యాప్‌ల ద్వారా మాట్లాడేవారని విచారణ సందర్భంగా నిందితులు పేర్కొన్నట్టు తెలిసింది. దీనితో సిట్ అధికారులు ఆ నలుగురు నిందితుల వాట్సప్ హిస్టరీని రికవరీ చేసి రెడీగా పెట్టుకున్నట్టు సమాచారం. దీని ఆధారంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును విచారించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.

Next Story