- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్ని అడ్డంకులు సృష్టించినా బాన్సువాడ వెళ్తాం.. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య సవాళ్లతో హైటెన్షన్ నెలకొనగా, బాన్సువాడ వెళ్లకుండా బీజేపీ నేత రామచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో సెగలు పుడుతున్నాయి. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతల మధ్య నెలకొన్న సవాళ్లు ప్రతిసవాళ్లతో కామారెడ్డిలో యుద్ధ వాతావరణం నెలకొంది. కలెక్టరేట్ వేదికగా తేల్చుకుందామంటూ ఇరు పార్టీల నేతలు రంగంలోకి దిగడంతో పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి (Katipally Venkataramana Reddy), కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ (Shabir Ali)కి బహిరంగ సవాల్ విసిరారు. కలెక్టరేట్ వద్దే అన్ని విషయాలు తేల్చుకుందామని ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో రాజకీయ ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. అయితే, ఎమ్మెల్యే కావాలనే ప్రధాన సమస్యను పక్కదారి పట్టించేందుకు (Issue Diversion) ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు కామారెడ్డి పట్టణంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
మాపై నిరాధార ఆరోపణలు.. రామచందర్ రావు
ఈ వివాదం నేపథ్యంలో బాన్సువాడ (Bansuwada) వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ తార్నాక (Tarnaka)లోని తన నివాసంలో బీజేపీ రాష్ట్ర నేత రామచందర్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బాన్సువాడ వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాన్సువాడలో తమ ఎమ్మెల్యేపై దాడి జరిగిందని ఆరోపించారు. కారును ధ్వంసం చేసింది కాంగ్రెస్ నేతలే, కానీ తిరిగి మాపైనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే దాడులకు దిగడం కాంగ్రెస్ సంస్కృతిగా మారిందని.. అక్కడ మా కార్యకర్తలు తమ కోసం ఎదురుచూస్తున్నారని కామెంట్ చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎట్టి పరిస్థితుల్లోనూ బాన్సువాడ వెళ్లి తీరుతామని రామచందర్ రావు స్పష్టం చేశారు. కాగా, బీజేపీ నాయకులు కామారెడ్డి, బాన్సువాడ వైపు రాకుండా పోలీసులు జిల్లాల సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం కామారెడ్డిలో ఎటు చూసినా పోలీస్ బలగాలే కనిపిస్తుండటంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.






