బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో పోరాడుతాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-06 05:05:19  IST  )

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో పోరాడుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka) స్పష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో పోరాడుతాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో పోరాడుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka) స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రంలో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు చేస్తున్నారని సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఇవాళ ఆ పిటిషన్ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ (Delhi)లోని తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్వకేట్ ఆన్ రికార్డ్ శ్రవణ్ కుమార్, బీసీ సంక్షేమ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, కో-ఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాక్ష్యాలు, సర్వే వివరాలు, చట్టపరమైన అంశాలపై చర్చించారు.

భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో పోరాటం చేస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations)కు రాష్ట్రంలో చట్టసభలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని పేర్కొన్నారు. ఎంపిరికల్ డేటా ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని.. 1991-90లోనే సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. తెలంగాణలో చేసినట్లుగా సీపెక్ సర్వే ఎక్కడా చేయలేదని అన్నారు. ఎంపిరికల్ డేటాతో ముందుకొచ్చాం కాబట్టే.. కోర్టులో తనమకు ఇబ్బంది ఉంటుందని అనుకోవడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వొకేట్లు అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్థ్ దవే తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధం ఉన్నారని తెలిపారు. ఏది ఏమైనా రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Read More: బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులే సుప్రీం కోర్టును ఆశ్రయించారు: మంత్రి పొన్నం

Next Story