శ్రామికుల దోపిడి, సరళీకృత ఆర్థిక విధానాలపై ఉద్యమాలు నిర్మిస్తాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

by Muthe.Rajitha |

అధికారంలో ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలంటూ ప్రశ్నిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు.

శ్రామికుల దోపిడి, సరళీకృత ఆర్థిక విధానాలపై ఉద్యమాలు నిర్మిస్తాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికారంలో ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలంటూ ప్రశ్నిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని, శ్రామికుల దోపిడీ, సామాజిక అణచివేత, సరళీకృత ఆర్థిక విధానాలపై బలమైన ఉద్యమాలను నిర్మిస్తామని వివరించారు. ఈనెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు విజయవంతంగా ముగిశాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీని, 15 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గాన్ని, 60 మందితో రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం ఎంబీ భవన్ లో మీడియా సమావేశంలో ఆ పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనేక హామీలిచ్చిందని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇతర హామీలేవీ అమలు కావడం లేదన్నారు. విద్యవైద్యం వ్యాపారంగా మారిందనీ, సామాన్యులకు అందని ద్రాక్షగా ఉందన్నారు. దావోస్‌ పర్యటనలో పెట్టుబడులు వచ్చాయంటూ రేవంత్‌రెడ్డి ఊదరగొడుతున్నారనీ, గతంలో కేటీఆర్‌ కూడా అదే చేశారని అన్నారు. రాష్ట్రంలో కార్మికులు, అసంఘటిత కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.400 కూలి, ఏడాదికి 150 పని దినాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దేశంలో, రాష్ట్రంలో సంపద సృష్టించే కార్మికులు, రైతులు, కూలీలు దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ సంస్థలు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, రాజకీయ నాయకులు, భూస్వాములకు ఉపయోగపడే విధానాలనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్నదని విమర్శించారు. శ్రామికవర్గ ప్రయోజనాల కోసం పోరాడేది కమ్యూనిస్టులు, సీపీఐ(ఎం) పార్టీ నేని స్పష్టం చేశారు. పేద ప్రజలకోసం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల ఆధారంగా, తమ వైఖరి ఆధారపడి ఉంటుందన్నారు. హామీల అమలును విస్మరిస్తే ఏ ప్రభుత్వానైనా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

దారిమళ్లుతున్న సబ్‌ప్లాన్‌ నిధులు

ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, ఆచరణలో మాత్రం శూన్య హస్తాన్ని చూపుతుందని జాన్ వెస్లీ అన్నారు.హైదరాబాద్‌ చుట్టూ ప్రభుత్వ భూములున్నాయని వివరించారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలు సామాజిక అణచివేతకు గురవుతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించినా దారి మళ్లుతున్నాయని విమర్శించారు. దళితుల సంక్షేమం, దళిత వాడల అభివృద్ధికి చర్యలు చేపట్టడం లేదన్నారు. సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థుల మెస్‌ చార్జీలను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచడం లేదని అన్నారు. బీసీ కులగణన చేపట్టాలనీ, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గిరిజనుల జనాభా ప్రకారం రిజర్వేషన్లను పెంచాలని కోరారు. శ్రామికుల ఆర్థిక దోపిడీ, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం అమలు కోసం బలమైన ఉద్యమాలను నిర్మిస్తామన్నారు.

బీజేపీ పై బీఆర్‌ఎస్‌ వైఖరేంటో చెప్పాలి

బీజేపీ మతోన్మాదంపై ప్రజల్లో చైతన్యం పెంపొందిస్తామని జాన్‌వెస్లీ అన్నారు. సామాజిక న్యాయానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకమని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని నిలువరించడమే తమ లక్ష్యమన్నారు. ఆ పార్టీ రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో లౌకికశక్తులు, సామాజిక శక్తులు కలిసి రావాలని కోరారు. బీజేపీ పట్ల బీఆర్‌ఎస్‌ వైఖరేంటో చెప్పాలని అన్నారు. పార్టీ సొంత శక్తిని పెంచుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామనీ, ఆ దిశగా కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ప్రజాసమస్యలపై నిరంతరం స్పందిస్తామని వివరించారు. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం కోసం పోరాడతామని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల విధానాలన్నీ ఒక్కటేనని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయాలను ముందుకుతెస్తామన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం వామపక్షాలను సంఘటితం చేస్తామన్నారు.

కమ్యూనిస్టు పార్టీలో కులం ఆధారంగా పదవులు ఉండవు

రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయని పోరాటాలను సీపీఐ(ఎం) నిర్వహించిందని జాన్‌వెస్లీ అన్నారు. కుల వివక్షకు పార్టీ వ్యతిరేకంగా పోరాడిరదని వివరించారు. రెండు గ్లాసుల పద్ధతి, దేవాలయాల్లోకి ప్రవేశం, దళితులకు కటింగ్‌ చేయాలంటూ ప్రతిఘటనా పోరాటాలను నిర్వహించిందని గుర్తు చేశారు. రాఘవులు సైకిల్‌ యాత్ర చేపట్టిందనీ, తమ్మినేని మహాజన పాదయాత్ర చేశారని వివరించారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ సాధన కోసం, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ సాధన కోసం అనేక ఉద్యమాలను నిర్మించిందని అన్నారు. ఈ పోరాటాల ఫలితంగా దేశంలోనే మొదటి సారి సబ్‌ప్లాన్‌ చట్టం ఉమ్మడి ఏపీలో అమల్లోకి వచ్చిందన్నారు. కమ్యూనిస్టు పార్టీలో ముఖ్యంగా సీపీఐ(ఎం)లో కులాన్ని బట్టి పదవులుండబోవని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ నిర్ణయాలను ముందుకుతీసుకెళ్లే క్రమంలోనే ఈ బాధ్యతలను పార్టీ అప్పగించిందని చెప్పారు. దళితుడు అయినందున బాధ్యతలను పార్టీ ఇవ్వలేదన్నారు. పోరాటాన్ని నడిపేందుకు తాను కూడా ఈ బాధ్యతలను చేయగలుగుతాననే ఉద్దేశంతోనే ఇచ్చిందని వివరించారు. ఓ సామాజిక తరగతి నుంచి ఈ బాధ్యతల్లోకి రావడం ప్రత్యేక సందర్భమని అన్నారు. ఈ ఎన్నికతో మార్పు వస్తుందని అనుకోవడం లేదనీ, ప్రజా పోరాటాల ద్వారా మార్పు వస్తుందన్నారు.

బండి సంజయ్ వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి

గద్దర్‌ గురించి స్పష్టమైన అవగాహన లేకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మాట్లాడారన్నారు.గద్దర్‌కు ప్రజల్లో గుర్తింపు ఉందనీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీ అవసరం లేదన్నారు. అహంకార ధోరణితో, మతోన్మాద వైఖరితో బండి సంజయ్‌ వ్యాఖ్యలున్నాయని విమర్శించారు. బీజేపీని సమర్థించే ఏ పార్టీ అయినా, సామాజిక సంఘమైనా, నాయకుడైనా వ్యతిరేకిస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతామని చెప్పారు. షెడ్యూల్‌ ప్రకటించాక ఎత్తుగడలను, పార్టీ నిర్ణయాలను ప్రకటిస్తామని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. శ్రీలంకలో కమ్యూనిస్టు పార్టీకి గత ఎన్నికల్లో మూడు శాతం ఓట్లు వచ్చాయని, ఇప్పుడు అధికారంలోకి వచ్చారని చెప్పారు. గతంలో చారిత్రక తప్పిదాలు చేయలేదనీ, తనకు ఈ పదవి రావడం చారిత్రక నిర్ణయం కాదని వివరించారు. కమ్యూనిస్టులు ఏకం కావాలని ఐక్య కార్యాచరణ, ఐక్య ఉద్యమాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడ అణచివేత, దోపిడీ, నిర్బంధం ఉంటుందో అక్కడ ప్రతిఘటన ఉంటుందన్నారు. నక్సలైట్లను అంతమొందించినా వారి భావాలను అణచివేయలేరన్నారు. అమిత్‌షా లాంటి వారు వంద మంది వచ్చినా తొక్కుకుంటూ విముక్తి పోరాటాలను చేపడాతమని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, టి జ్యోతి, టి సాగర్‌, ఎండీ అబ్బాస్‌, మల్లు లక్ష్మి, బండారు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story