- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోసపోయాం.. మాకు న్యాయం చేయండి.. హైడ్రా ప్రజావాణిలో అమీన్‌పూర్ పేదల వేడుకోలు
‘కూలీ డబ్బులు చిట్టీలు వేసుకుని.. ఊళ్లలో ఉన్న కాస్త పొలం అమ్ముకుని.. నానా అవస్థలు పడి ప్లాట్లు కొనుక్కొన్నాం. ఇప్పుడెవరూ పలకడంలేదు’ అని ప్రభుత్వమే న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఒకరా ఇద్దరా.. అందరూ ముఖీం అనుచరులే.. ముఖీం పెద్ద లాయర్ మా వెంట ఉన్నారు.. మీకేం కాదు.. మేం చూసుకుంటాం.. అని నమ్మబలికి మాకు 70 గజాల చొప్పున ప్లాట్లు అమ్మేశారు. ప్రభుత్వ భూమి అని మాకు తెలియదు.. అందరూ కొనుక్కుంటున్నారు.. అలాగే మేమూ కొనుక్కున్నాం.. ఇప్పుడు వారిని అడిగితే మాకేమి తెలీదు.. ఖాళీ జాగా ఉంచొద్దు.. వెంటనే ఇల్లు కట్టుకోండి అని చెబితే మీరు వినలేదని తిరిగి మమ్మలనే దబాయిస్తున్నారు. మా డబ్బులు మాకిచ్చేయండి అంటే.. అవెప్పుడో ఎవరి వాటాలు వారికి వెళ్లిపోయాయి.. మా దగ్గర లేవని దాటేస్తున్నారు. మా నోటరీలు.. అగ్రిమెంట్లు చూసి ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి’ అంటూ సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలోని ఐలాపూర్ కు చెందిన వందలాది మంది బాధితులు సోమవారం హైడ్రా ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేశారు. కురుమ మల్లేష్, మాణిక్ యాదవ్, రవి నాయక్, రామచంద్ర నాయక్ తదితరులు ముఖీం అనుచరులుగా వేర్వేరు పేర్లతో అగ్రిమెంట్లు, నోటరీలు చేసి అమ్మారంటూ పేర్కొన్నారు. ‘కూలీ డబ్బులు చిట్టీలు వేసుకుని.. ఊళ్లలో ఉన్న కాస్త పొలం అమ్ముకుని.. నానా అవస్థలు పడి ప్లాట్లు కొనుక్కొన్నాం. ఇప్పుడెవరూ పలకడంలేదు’ అని ప్రభుత్వమే న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. వీటికి తోడు.. నగరంలో ప్రభుత్వ భూములు, యూఎల్‌సీ ల్యాండ్స్, అసైన్డ్ భూములు కబ్జాలకు గురౌతున్నాయని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఔటర్ రింగు రోడ్డు నిర్మాణంలో సేకరించిన అసైన్డ్ భూముల్లో మట్టిని అమ్ముకున్నవారే.. ఇప్పుడు ఆ భూములను కూడా కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని దుండిగల్ గ్రామ నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆ భూములు అసైనీలకు దక్కాలి.. లేదంటే ప్రభుత్వానికి ఉండాలి కాని మధ్యలో కబ్జాదారుల పాలవ్వకుండా చూడాలని కోరారు.
బ్లూసీ వెనుక ఉన్న 2 ఎకరాలను కాపాడండి..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని బ్లూసీ హోటల్ వెనుక ఉన్న 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో దరఖాస్తు అందజేశారు. ప్రభుత్వ భూమిని కొట్టేయాలని అక్కడివారు కేసులు ఒకరిపై ఒకరు వేసుకుని నడిపిస్తున్నారని.. ఈ విషయంలో హైడ్రా చొరవ తీసుకుని కాపాడాలన్నారు. కిక్కిరిసిన జనాభా ఉన్న ఈ ప్రాంతంలో పార్కును అభివృద్ధి చేయాలని కోరారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి విలేజ్ సర్వే నంబరు 54లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని.., రంగారెడ్డి జిల్లా శేరిలింగంప్లి మండలం, మియాపూర్ గ్రామంలోని సర్వే నంబరు 100, 101లో ఎకరా ప్రభుత్వ భూమి ఉంటే స్థానికంగా ఉన్న వారు కబ్జా చేస్తున్నారని శ్రీ శక్తి మహిళామండలి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. సికింద్రబాద్ బేగంపేటలోని బ్రాహ్మణవాడి సర్వే నంబరు 210లో 3 వేల గజాల స్థలం ప్రభుత్వానిది కాగా.. కబ్జాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సైదాబాద్ లోని ఫిష్ మార్కెట్ వద్ద ఓపెన్ ప్లేస్ 4083 గజాలుంటే.. దానిని పిల్లలకోసం పార్కును అభివృద్ధి చేయాలని మేమంతా జీహెచ్ఎంసీని కోరుతుంటే.. మధ్యలో వేరే వ్యక్తులు వచ్చి కబ్జాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమదంటే తమదని ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ భూమిపై కోర్టుకెక్కడం.. వాళ్లలో ఎవరో ఒకరు సొంతం చేసుకుంటున్నారని.. రెవెన్యూ, జీహెచ్ఎంసీకి కూడా ఫిర్యాదు చేశామని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ పరిశీలించి.. పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి.. పత్రాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.
జీహెచ్ఎంసీలో 62 ఫిర్యాదులు..
జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్ ఆఫీసుల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు వచ్చాయి. హెడ్ ఆఫీసులో 35, శంషాబాద్ జోన్ 12, రాజేంద్రనగర్ జోన్ 2, చార్మినార్ జోన్ 1, గోల్కొండ జోన్ 2, ఖైరతాబాద్ జోన్ 1, సికింద్రాబాద్ జోన్ 9 ఫిర్యాదులు వచ్చాయి. అయితే మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు కమిషనర కర్ణన్ కు వినతి పత్రం అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ కర్ణన్ ఆదేశించారు.
సీఎంసీలో 4 3ఫిర్యాదులు..
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) పరిధిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 43 ఫిర్యాదులు వచ్చాయి. టౌన్ ప్లానింగ్ 24, ఇంజనీరింగ్ ఏడు, ఫైనాన్స్ & అకౌంట్స్ నాలుగు, అర్బన్ బయోడైవర్సిటీ మూడు, రెవెన్యూ రెండు, చెరువులు, పారిశుధ్యం, వెటర్నరీ విభాగాలకు సంబంధించిన ఒక్కో ఫిర్యాదులు వచ్చాయి. బాధ్యతాయుతమైన పాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. పౌరులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, తక్షణ పరిష్కారం పొందేందుకు ఈ వేదిక ఎంతో దోహదపడుతుందన్నారు.
ఎంఎంసీలో 27 ఫిర్యాదులు..
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 27 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో మొత్తం 27 వినతి పత్రాలు అందగా, వాటిని సంబంధిత విభాగాలకు పంపించి తక్షణ పరిష్కారం కోసం కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉందని, వాటి పరిష్కారం వరకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని కమిషనర్ తెలిపారు.






